సెంట్రల్‌ బ్యాంక్‌పై మండిపడ్డ ట్రంప్‌

17 Oct, 2018 11:25 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఫైర్‌ అయ్యారు. ఫెడరల్‌ రిజర్వే తనకు అతిపెద్ద ముప్పుగా ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వడ్డీరేట్లను ఆ బ్యాంక్‌ వెంటవెంటనే పెంచుతుండటంపై ట్రంప్‌ విమర్శల వర్షం కురిపించారు. ‘నాకు అతిపెద్ద ప్రమాదం ఫెడరల్‌ రిజర్వు బ్యాంక్‌. ఎందుకంటే వడ్డీరేట్లను ఎంతో వేగవంతంగా పెంచుతుంది’ అని ఫాక్స్‌ బిజినెస్‌ టెలివిజన్‌కు ఆయన చెప్పారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఓ స్వతంత్ర సంస్థ అని, అందువల్ల తాను వారితో మాట్లాడననని చెప్పారు. కానీ ఫెడరల్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌పై నేరుగా విమర్శలు చేశారు. వడ్డీరేట్లను నెమ్మదిగా పెంచుతా అని చెప్పి, దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. 

జెరోమ్‌ వ్యవహరిస్తున్న తీరుపై తాను అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. గతవారం ​స్టాక్స్‌ భారీగా పడిపోవడానికి కారణం జెరోమ్‌ పావెలే అని నిందించారు. ఆయన సరైన వ్యక్తి అవ్వొచ్చు లేదా తప్పు అవ్వొచ్చు కానీ ఆయన్ని అక్కడ నుంచి తొలగించనని పావెల్‌ను ఉద్దేశించి చెప్పారు. ఫెడ్‌ తన మానిటరీ పాలసీతో ఎల్లప్పుడు తప్పులు చేస్తూనే ఉందని విశ్వసిస్తున్నట్టు ట్రంప్‌ పలుమార్లు విమర్శించారు. అక్టోబర్‌ 11న ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పావెల్‌ నిర్ణయాలపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు