రాజకీయాలపై చర్చలొద్దు: గూగుల్‌

24 Aug, 2019 15:45 IST|Sakshi

ప్రపంచంలో ఎవరికి ఏ సందేహం వచ్చినా టక్కున గుర్తొచ్చేది గూగుల్‌. మానవ జీవితంలో అంతగా పెనవేసుకున్న ఈ ఇంటర్నెట్‌ దిగ్గజం అందులో పనిచేసే ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. గూగుల్‌లో ముఖ్యభాగమైన ఇంటర్నెట్ విభాగంలో రాజకీయాల గురించి చర్చించే బదులుగా పనిపై దృష్టి పెట్టాలని శుక్రవారం ఉద్యోగులకు సూచించింది. చాలా కాలంగా ప్రజల మనస్సులను చూరగొన్న సంస్థ అదే ఉత్సాహాన్ని కొనసాగించాలనుకుంటుంది. అందులో భాగంగానే మార్గదర్శకాలను నవీకరించారు. సహోద్యోగులతో నిత్యం కొత్త ఆలోచనలు, సమన్వయంతో, అంతర్గత బోర్డు సమావేశాలు ద్వారా ఆలోచనలకు పదును పెట్టాలని గూగుల్‌ పేర్కొంది.

కొత్త నిబంధనల ప్రకారం తాజా రాజకీయాల గురించి చర్చించి సమయం వృధా చేసుకోవద్దని, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలకు పదును పెట్టాలని కంపెనీ సూచించింది. చర్చలు, వాదోపవాదాలకు దూరంగా ఉండాలని కేటాయించిన పనిని సక్రమంగా నిర్వర్తించాలని కోరింది. కంపెనీ  ప్రాథమిక బాధ్యత మెరుగైన సేవలను అందించడమే, అందుకోసం నిబద్ధతతో పనిచేయాలని కంపెనీ తెలియజేసింది. కంపెనీ  కార్యకలాపాలను  ప్రశ్నించడానికి, చర్చించడానికి  అందరికి స్వేచ్ఛ ఉందని నూతన మార్గదర్శకాలలో పొందుపర్చారు. అయితే, కంపెనీ ఉత్పత్తులను, నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా  తప్పుడు ప్రచారం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంపెనీపై చేసిన నిరాదారమైన ఆరోపణలను గూగుల్‌ ఖండించింది. ఎన్నికల్లో తనకు, తన మద్దతుదారులకు గూగుల్‌ వ్యతిరేకంగా పనిచేసిందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. మాజీ ఉద్యోగి కంపెనీ పై చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని పేర్కొంది. గతంలో పనివేళల్లో లైంగిక వేధింపులు, యుఎస్ రక్షణ, ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీలతో కాంట్రాక్ట్‌ ఒప్పందాలపై గూగుల్‌ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు