మాల్యా అప్పులపై బిత్తరపోయే సమాధానం

7 Feb, 2018 15:44 IST|Sakshi
విజయ్‌మాల్యా(ఫైల్‌)

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా అప్పులపై ఆర్థికమంత్రిత్వ శాఖ బిత్తరపోయే సమాధానమిచ్చింది. మాల్యా అప్పులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ దగ్గర లేవని కేంద్ర సమాచార కమిషన్‌కి కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మాల్యా అప్పులకు సంబంధించి వివరాలు కావాలంటూ రాజీవ్‌ కుమార్‌ ఖరే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థికశాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఆ వివరాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ నుంచి సరియైన స్పందన రాలేదు. అంతేకాక తాము ఆ రికార్డులను ఇవ్వలేమని, వ్యక్తిగత భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే వివరాలు ఇవ్వకుండా ఆర్‌టీఐ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయంటూ ఆర్ధిక శాఖ తెలిపింది. కానీ అంతకముందు ఇదే విషయంపై పార్లమెంట్‌లో ఆర్థికమంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది.

ఆర్థిక శాఖ వైఖరితో షాక్ అయిన రాజీవ్, సమాచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించారు. ఆ కమిషన్, ఆర్థికశాఖను వివరాల కోరింది. మళ్లీ అదే సమాధానాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెప్పింది.  మాల్యా అప్పులకు సంబంధించిన రికార్డులేవీ తమ దగ్గర లేవని, దరఖాస్తుదారుడు కోరుతున్న సమాచారం ఆయా బ్యాంకులు లేదా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దగ్గర ఉండొచ్చని చెప్పింది. ఆర్థికశాఖ సమాధానంపై సమాచార హక్కు కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టప్రకారం ఇది అస్పష్టమైన, అస్థిరమైన జవాబు అంటూ నిరసన వ్యక్తం చేసింది. రాజీవ్‌ దరఖాస్తును సంబంధిత పబ్లిక్‌ అథారిటీకి బదిలీ చేయాలని సూచించింది.
 

మరిన్ని వార్తలు