ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ

1 Jun, 2020 20:04 IST|Sakshi

 ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశానికి ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్రం నో

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ  ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్‌ తగిలింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో  అమెజాన్ ఇండియాతో పోటీ పడుతూ  ఆహార సంబంధిత వ్యాపార ప్రణాళికలకు ఫ్లిప్‌కార్ట్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.  ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించాలన్న ఫ్లిప్‌కార్ట్ ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ప్రతిపాదిత ప్రణాళిక నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన నియంత్రణ సంస్థ డిపార్ట్‌మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి)  తెలిపింది.  

మరోవైపు ఈ పరిణామంపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజనీష్ కుమార్  ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ,  ఇన్నోవేషన్‌ ఆధారంగా నడిచే మార్కెట్  దేశ  రైతులు భారీ ప్రయోజనాన్ని సమకూరుస్తుందన్నారు.సప్లయ్‌ చెయిన్‌ సామర్థ్యం పెంపు, పారదర్శకతతో దేశ రైతులకు,ఆహార ప్రాసెసింగ్ రంగానికి గణనీయమైన విలువను చేకూరుస్తుందని నమ్ముతున్నామన్నారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు, వ్యవసాయంలో కీలక మార్పులకు దోహపడుతుందన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెజాన్ 2017లో భారతదేశంలో ఆహార ఉత్పత్తుల రిటైల్‌ వ్యాపారం కోసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది.

కాగా దేశం పెరుగుతున్న ఆహార రిటైల్ మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికను గత ఏడాది అక్టోబర్‌లో  ప్రకటించిన, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి ఈ కొత్త వెంచర్‌లో 258 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ కాలంలో కిరాణా విభాగం గణనీయమైన వృద్ధిని సాధించింది.  కఠిన ఆంక్షలతో ఇంటికే పరిమితమైన చాలామంది వినియోగదారులు ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై మొగ్గు చూపారు.  దీంతో గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్ అమెజాన్‌ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. రాబోయే నెలల్లో  కూడా ఇది కొనసాగుతుందని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆహార రిటైల్ రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తుండటం గమనార్హం.

చదవండి : అతిపెద్ద మొబైల్‌ మేకర్‌గా భారత్‌: కొత్త పథకాలు
షావోమి ల్యాప్‌టాప్‌ లాంచ్‌ : ఈ నెలలోనే​

మరిన్ని వార్తలు