5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యమే

4 Oct, 2019 10:09 IST|Sakshi

పటిష్టమైన విధానాల ఊతం

వ్యాపారాల నిర్వహణ సానుకూలత  

డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో డీపీఐఐటీ కార్యదర్శి మహాపాత్ర వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు భారత్‌లో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మహాపాత్ర వెల్లడించారు. పటిష్టమైన విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సారథ్యంలో ఈ లక్ష్యం సులభసాధ్యమేనని గురువారం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం భారత ఆర్థిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టిన భారత్‌.. 2024 నాటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లు, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకుంది. ఇది కచ్చితంగా సాధ్యమే.

ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం స్థాయిలో ప్రభుత్వాలు పటిష్టమైన విధానాలు అమలు చేస్తుండటంతో ఇందుకు పూర్తి అనువైన పరిస్థితులు ఉన్నాయి’ అని మహాపాత్ర తెలిపారు. కాగా, అధిక వృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టబోతోందని నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు.  మరోవైపు, చౌక ధరలు, డిస్కౌంట్లతో పోటీ సంస్థలను దెబ్బకొట్టేందుకు ఈ–కామర్స్‌ వేదికను విదేశీ కంపెనీలు ఉపయోగించరాదని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ సూచించారు. విదేశీ ఈ–రిటైల్‌ కంపెనీలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్నే ఆందోళనల నేపథ్యంలో గోయల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రభుత్వం మరింత ఊతం ఇవ్వాలి..
పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం మరింత ఊతం ఇవ్వాలని గోద్రెజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఆది గోద్రెజ్‌ చెప్పారు. మందగిస్తున్న ఎకానమీ వృద్ధి రేటుకు తోడ్పాటునిచ్చేలా వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇవి ద్రవ్య లోటును పెంచేవే అయినా తప్పక తీసుకోవాల్సిన చర్యలని గోద్రెజ్‌ చెప్పారు. అటు, ఇంటర్నెట్‌ సేవల ప్రయోజనాలు అందరికీ సమానంగా అందాలని, ప్రాంతీయ భాషల్లో మరింత కంటెంట్‌ అందుబాటులోకి రావాలని ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు.  

హువావేకు ఎయిర్‌టెల్‌ మిట్టల్‌ బాసట
భద్రతాపరమైన అంశాల పేరిట చైనా సంస్థ హువావేను ప్రపంచ దేశాలు నిషేధించేలా అమెరికా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ ఆ కంపెనీకి బాసటగా నిల్చారు. హువావే ఉత్పత్తులు అధునాతనమైనవని, పోటీ సంస్థల ఉత్పత్తులతో పోలిస్తే ఎన్నో రెట్లు ఉత్తమమైనవని ఆయన చెప్పారు. 5జీ సేవలకు సంబంధించి హువావే కచ్చితంగా బరిలో ఉండాల్సిందేనని మిట్టల్‌ చెప్పారు. అయితే, భద్రతాపరమైన రిస్కుల వల్లే హువావేని వ్యతిరేకిస్తున్నామని, రక్షణాత్మక ధోరణులకు.. దీనికి సంబంధం లేదని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు