డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 764 కోట్లు

21 May, 2020 04:10 IST|Sakshi

క్యూ4లో 76 శాతం అప్‌

గ్లోబల్‌ జనరిక్స్‌ వృద్ధి ఊతం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ నికర లాభం 76 శాతం పెరిగి రూ. 764.2 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 434.4 కోట్లు. తాజాగా గ్లోబల్‌ జనరిక్స్‌ వ్యాపార విభాగం గణనీయంగా వృద్ధి చెందడం, పన్నులపరమైన భారం కొంత తగ్గడం తదితర అంశాలు లాభాల వృద్ధికి దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్‌వో సౌమేన్‌ చక్రవర్తి తెలిపారు. క్యూ4లో ఆదాయం 10 శాతం వృద్ధితో సుమారు రూ. 4,017 కోట్ల నుంచి దాదాపు రూ. 4,432 కోట్లకు పెరిగింది.  కోవిడ్‌–19 వ్యాధి చికిత్సకు ఉపయోగపడే ఔషధాలను తయారు చేసేందుకు ఇతర సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ జీవీ ప్రసాద్‌ వెల్లడించారు.  

అత్యధిక అమ్మకాలు..
నాలుగో త్రైమాసికంలో అత్యధిక స్థాయిలో విక్రయాలు నమోదు చేసినట్లు చక్రవర్తి తెలిపారు. వార్షికంగా ఆదాయాలు 13 శాతం, లాభాలు నాలుగు శాతం పెరిగాయని పేర్కొన్నారు. వార్షిక లాభాల వృద్ధికి పన్ను అంశంతో పాటు కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ) క్రెడిట్‌ కూడా తోడ్పడిందని వివరించారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం మెరుగ్గా సాగిందని సౌమేన్‌ చక్రవర్తి తెలిపారు. క్యూ4లో ఫార్మా సర్వీసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు 6 శాతం పెరిగి రూ. 719.5 కోట్లకు చేరాయి. అంతర్జాతీయంగా జనరిక్స్‌ విభాగం ఆదాయం 20% పెరిగి రూ. 3,640 కోట్లకు చేరింది. ఇందులో ఉత్తర అమెరికా మార్కెట్‌ 21% పెరిగి రూ. 1,496 కోట్ల నుంచి రూ.1,807 కోట్లకు ఎగసింది. యూరప్‌ దేశాల్లో ఆదాయాలు 80% వృద్ధితో రూ. 345 కోట్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయాలు 5% పెరిగాయి. కరోనా వైరస్‌ కట్టడిపరమైన లాక్‌డౌన్‌ కారణంగా సరుకు రవాణా సంబంధ సమస్యలతో అమ్మకాలపై పాక్షికంగా ప్రభావం పడింది.
2019–20 ఏడాదికి గాను రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 25 తుది డివిడెండ్‌ చెల్లించాలని నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు