డాక్టర్‌ రెడ్డీస్‌ నికర లాభం జూమ్‌

20 May, 2020 14:43 IST|Sakshi

క్యూ4లో 76 శాతం వృద్ధి

రూ. 764 కోట్లకు నికర లాభం

5 శాతం జంప్‌చేసిన షేరు

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికం(క్యూ4)లో ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 3865 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,883ను సైతం అధిగమించింది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ. 764 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 76 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 10 శాతం పెరిగి రూ. 4,432 కోట్లను తాకింది.

గతేడాది సానుకూలం
గత ఆర్థిక సంవత్సరంలో సానుకూల ఫలితాలు సాధించగలిగినట్లు క్యూ4 ఫలితాల విడుదల సందర్భంగా డాక్టర్‌ రెడ్డీస్‌ సహచైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఇందుకు కొత్త ప్రొడక్టుల విడుదల, ఉత్పాదకత పెంపు, వివిధ విభాగాలలో పటిష్ట పనితీరు వంటి అంశాలు దోహదం చేసినట్లు తెలియజేశారు. సీటీవో-6కు సంబంధించి వీఏఐ పురోగతి సైతం ఇందుకు సహకరించినట్లు వివరించారు. కాగా.. క్యూ4లో డాక్టర్‌ రెడ్డీస్‌ ఇబిటా మార్జిన్లు 0.6 శాతం బలపడి 22.6 శాతాన్ని తాకాయి. నికర లాభ మార్జిన్లు మరింత అధికంగా 10.8 శాతం నుంచి 17.2 శాతానికి జంప్‌చేశాయి. అతిపెద్ద జనరిక్స్‌ మార్కెట్‌గా నిలుస్తున్న ఉత్తర అమెరికా నుంచి రూ. 1807 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ పేర్కొంది.యూరప్‌ నుంచి రూ. 345 కోట్ల అమ్మకాలు సాధించగా..దేశీ బిజినెస్‌ వాటా రూ. 684 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. ఇతర వర్ధమాన మార్కెట్ల నుంచి రూ. 804 కోట్ల ఆదాయం లభించినట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు