షేర్ల బైబ్యాక్‌కు డాక్టర్ రెడ్డీస్ ఓకే

18 Feb, 2016 01:21 IST|Sakshi
షేర్ల బైబ్యాక్‌కు డాక్టర్ రెడ్డీస్ ఓకే

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపింది. ఓపెన్ మార్కెట్లో ఒక్కొక్కటి రూ.3,500లకు మించకుండా 44.84 లక్షల షేర్లను కొనుగోలు చేసేందుకు... అంటే దాదాపు రూ.1,569 కోట్ల వరకు వెచ్చించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్‌లో 2.6 శాతానికి సమానం. కనీసం 22.42 లక్షల షేర్లను రెడ్డీస్ కొనుగోలు చేయనుంది.

ఇక బైబ్యాక్ ధర గడిచిన రెండు వారాల్లో వీక్లీ హై, లో క్లోజింగ్ ప్రైస్ సగటుతో పోలిస్తే... 18.6 శాతం ఎక్కువని కంపెనీ వెల్లడించింది. షేర్ల బైబ్యాక్‌కు వెళ్లనున్నట్టు గత వారం కంపెనీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కంపెనీ ప్రకటన నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ధర ఒక దశలో 4.52 శాతానికి పైగా ఎగసింది. చివరకు షేరు 3.52 శాతం లాభపడి రూ.2,961 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో షేరు ధర 3.67 శాతం పెరిగి రూ.2,960.70 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.50,517.78 కోట్లకు చేరుకుంది.

 కాగా, కంపెనీకి చెందిన మూడు ప్లాంట్లలో ఉల్లంఘనలు జరిగాయంటూ యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమగ్ర సంస్కరణలు, దిద్దుబాటు కార్య ప్రణాళికను (సీఏపీఏ) పూర్తి చేసినట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సీవోవో అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. ఈ విషయమై యూఎస్‌ఎఫ్‌డీఏ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు