డాక్టర్ రెడ్డీస్ లాభం 309 కోట్లు

26 Oct, 2016 01:07 IST|Sakshi
డాక్టర్ రెడ్డీస్ లాభం 309 కోట్లు

క్యూ2లో 60 శాతం డౌన్
అమెరికా, వర్ధమాన మార్కెట్లలో తగ్గిన అమ్మకాలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (డీఆర్‌ఎల్) నికర లాభం సుమారు 60 శాతం క్షీణించి రూ. 309 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 775 కోట్లు. ఈసారి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం సైతం 10 శాతం క్షీణతతో సుమారు రూ. 4,021 కోట్ల నుంచి రూ. 3,616 కోట్లకు తగ్గింది. ఉత్తర అమెరికా మార్కెట్లో కొన్ని కీలక ఔషధాలకు సంబంధించి ధరలపరమైన ఒత్తిళ్లతో అమ్మకాలు తగ్గడం కారణంగా స్థూల లాభాల మార్జిన్ 56 శాతం మేర క్షీణించినట్లు కంపెనీ తెలిపింది.

వెనిజులాలో ప్రతికూల పరిస్థితులు, వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు క్షీణించడం.. ఆదాయం తగ్గుదలకు మరో కారణమని పేర్కొంది. అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు కొనసాగవచ్చని, అయితే మరిన్ని కొత్త ఉత్పత్తుల ఆవిష్కరించడం ద్వారా వృద్ధి మెరుగుపర్చుకోగలమని డీఆర్‌ఎల్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వెనిజులా నుంచి రావాల్సిన ఫార్మా బకాయిల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

క్యూ2లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై దాదాపు రూ. 520 కోట్లు వెచ్చించినట్లు చక్రవర్తి తెలిపారు. ఔషధాల ధరలను నియంత్రించేలా నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ జారీ చేసిన కొన్ని నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ ఇండియన్ ఫార్మా అలయెన్స్ 2014 జులైలో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో భవిష్యత్‌లో ఎదురయ్యే రూ. 34.4 కోట్ల ఖర్చులను విక్రయ వ్యయాల కింద చూపాల్సి వచ్చినట్లు వివరించారు. మరోవైపు,  సీక్వెన్షియల్ ప్రాతిపదికన  మాత్రం అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనపర్చడంతో కంపెనీ ఆదాయం 11 శాతం, స్థూల లాభం 61 శాతం మేర పెరిగింది.

వృద్ధి ప్రణాళికలు ..
అధిక వృద్ధి సాధించే క్రమంలో కొంగ్రొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నట్లు, త్వరలో బ్రెజిల్‌లోనూ అడుగుపెట్టనున్నట్లు ముఖర్జీ తెలిపారు. ఇకనుంచి ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు కొత్త దేశాల మార్కెట్లలో ప్రవేశించాలని భావిస్తున్నట్లు సంస్థ సీవోవో అభిజిత్ ముఖర్జీ చెప్పారు. అలాగే ప్రతీ సంవత్సరం తరహాలోనే ఈసారీ రూ. 1,000-రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రూ. 632 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం, మిర్యాలగూడ, దువ్వాడ ప్లాంట్లలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఈ ఏడాది జనవరి, మార్చి, మే, ఆగస్టుల్లో అమెరికా ఎఫ్‌డీఏకి నివేదికలు పంపామని, మరోసారి ప్లాంట్లను పరిశీలించాలని కోరినట్లు ముఖర్జీ వివరించారు. ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 40 మిలియన్ డాలర్లు వ్యయమైనట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్లాంటును ఇటీవలే కెనడాకు చెందిన ఔషధ రంగ నియంత్రణ సంస్థ పరిశీలించినట్లు ముఖర్జీ వివరించారు.

 రెండో త్రైమాసికంలో డీఆర్‌ఎల్ గ్లోబల్ జెనరిక్ విభాగం ఆదాయం 12% తగ్గి 2,900 కోట్లకు పరిమితమైంది. ఉత్తర అమెరికా మార్కెట్‌లో అమ్మకాలు 13%, యూరప్‌లో 16%, వర్ధమాన మార్కెట్లలో 27 శాతం తగ్గాయి. అయితే భారత్‌లో మాత్రం 14 శాతం మేర వృద్ధి చెందాయి. ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు భారత్‌లో 21 శాతం క్షీణించగా.. అమెరికాలో 64 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2 శాతం క్షీణతతో రూ. 578 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ షేరు సుమారు 3.5 శాతం పెరిగి రూ. 3,200 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు