డాక్టర్‌ రెడ్డీస్‌ నష్టం రూ.570 కోట్లు

28 Jan, 2020 07:58 IST|Sakshi
మీడియా సమావేశంలో సౌమెన్‌ చక్రవర్తి, ఎరెజ్‌ ఇజ్రాయెలి (కుడి)

ఆదాయం 14 శాతం పెరిగి రూ.4,384 కోట్లు

ఎబిటా 24 శాతం అధికమై రూ.1,074 కోట్లకు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆర్థిక ఫలితాల విషయంలో అనలిస్టుల అంచనాలు తారుమారయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో భారీ నష్టం చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ రూ.569.7 కోట్ల నష్టం ప్రకటించింది. 2018–19 క్యూ3లో రూ.485 కోట్ల నికరలాభం ఆర్జించింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం రూ.4,384 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం పెరుగుదల. ఇక ఎబిటా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24 శాతం అధికమై రూ.1,074 కోట్లుగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచామని డాక్టర్‌ రెడ్డీస్‌ కో–చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ తెలిపారు. బలమైన ఎబిటా మార్జిన్స్‌ నమోదు చేశామని చెప్పారు. జి–నువారింగ్‌తోపాటు కొన్ని ఉత్పత్తుల బ్రాండ్‌ విలువ పడిపోవడం, ఆ మేరకు కేటాయింపులు చేయడం వల్ల నష్టం చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. ఈ కేటాయింపులు రూ.1,320 కోట్లుగా ఉన్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఎఫ్‌ఓ సౌమెన్‌ చక్రవర్తి, సీఈవో ఎరెజ్‌ ఇజ్రాయెలి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.

కలిసొచ్చిన గ్లోబల్‌ జనరిక్స్‌..
కంపెనీకి గ్లోబల్‌ జనరిక్స్‌ కలిసొచ్చాయి. ఈ విభాగం నుంచి ఆదాయం రూ.3,593 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదల. యూరప్, కొత్తగా ఉద్భవిస్తున్న మార్కెట్లు, భారత్‌ ఈ ఆదాయ వృద్ధికి దోహదం చేశాయి. ఉత్తర అమెరికా నుంచి 8 శాతం వృద్ధితో రూ.1,600 కోట్ల ఆదాయం సమకూరింది. యూఎస్‌ మార్కెట్లో ఈ త్రైమాసికంలో కంపెనీ అయిదు కొత్త ఉత్పత్తులు విడుదల చేసింది. ఎమర్జింగ్‌ మార్కెట్ల నుంచి రూ.920 కోట్లు, భారత్‌ నుంచి రూ.763 కోట్ల రెవెన్యూ నమోదైంది. యూరప్‌ నుంచి 52 శాతం వృద్ధితో రూ.310 కోట్ల రెవెన్యూ సాధించింది.

మరిన్ని వార్తలు