డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.504 కోట్లు

27 Oct, 2018 01:28 IST|Sakshi
ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ సీఎఫ్‌వో సౌమేన్‌ చక్రవర్తి. పక్కన సీవోవో ఎరెజ్‌ ఇజ్రేలి

అమెరికాలో ప్లాంటు విక్రయంతో ఏకమొత్తం ఆదాయం

దాంతో 77 శాతం పెరిగిన నికరలాభం

7 శాతం వృద్ధితో రూ. 3,798 కోట్లకు మొత్తం ఆదాయం  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వర్ధమాన దేశాల మార్కెట్లు, కొత్త ఉత్పత్తుల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) లాభం 77 శాతం ఎగిసింది. రూ. 504 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం సుమారు రూ. 285 కోట్లు. మరోవైపు, ఆదాయం 7 శాతం వృద్ధితో రూ. 3,546 కోట్ల నుంచి  రూ. 3,798 కోట్లకు పెరిగింది. జనరిక్‌ ఔషధం సుబాక్సోన్‌ అమ్మకాలు ఆగిపోవడంతో సీక్వెన్షియల్‌గా ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిందని శుక్రవారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్‌ఎల్‌ సీఎఫ్‌వో సౌమేన్‌ చక్రవర్తి తెలిపారు.

అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు తదితర అంశాలతో విక్రయాలపై ప్రభావం పడినప్పటికీ .. వర్ధమాన మార్కెట్లు, భారత్‌లో అమ్మకాలు పుంజుకోవడం, ఫారెక్స్‌పరమైన ప్రయోజనాలు మొదలైనవి సానుకూలంగా దోహదపడ్డాయని ఆయన వివరించారు. భవిష్యత్‌లోనూ వ్యయాల నియంత్రణ, ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు సౌమేన్‌ చక్రవర్తి చెప్పారు.

అమెరికాలోని బ్రిస్టల్‌లో ప్లాంటు, క్లోడెర్మ్‌ బ్రాండు విక్రయం ద్వారా వచ్చిన నిధులు కూడా మెరుగైన ఫలితాలు ప్రకటించడానికి దోహదపడ్డాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 371 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేశామని, పూర్తి ఆర్థిక సంవత్సరం రూ. 1,200 కోట్ల దాకా కేపెక్స్‌ ఉండగలదని అంచనా వేసినప్పటికీ.. ఇది రూ. 800–1,000 కోట్లకు పరిమితం కావొచ్చని సౌమేన్‌ పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై వ్యయాలు రెండో త్రైమాసికంలో రూ. 412 కోట్లుగా నమోదయ్యాయి.  

గ్లోబల్‌ జనరిక్స్‌ 7 శాతం వృద్ధి..
గ్లోబల్‌ జనరిక్స్‌ మొత్తం 7% వృద్ధి చెందింది. ఆదాయం రూ. 2,861 కోట్ల నుంచి రూ. 3,053 కోట్లకు పెరిగింది. రెండో క్వార్టర్‌లో ప్రధానంగా సుబాక్సోన్‌ ఔషధ విక్రయాలు నిల్చిపోవడం, ధరలపరమైన ఒత్తిళ్లు ఉత్తర అమెరికాలో ఆదాయానికి గండికొట్టాయని సౌమేన్‌ చక్రవర్తి చెప్పారు. ఉత్తర అమెరికాలో కొత్తగా నాలుగు ఉత్పత్తులు ప్రవేశపెట్టినట్లు, మరో 3 కొత్త ఔషధాల కోసం దరఖాస్తు చేసినట్లు ఆయన వివరించారు. ద్వితీయార్ధంలో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు.

మెరుగ్గా భారత్, వర్ధమాన మార్కెట్లు
గ్లోబల్‌ జనరిక్స్‌కి సంబంధించి ఉత్తర అమెరికా (0.4 శాతం) , యూరప్‌ మార్కెట్లలో (21 శాతం) క్షీణత నమోదైనప్పటికీ.. వర్ధమాన మార్కెట్లు (36 శాతం), భారత్‌ (8 శాతం) మేర వృద్ధి చెందాయి. వర్ధమాన మార్కెట్లకు సంబంధించి రష్యా, రొమేనియా మొదలైన దేశాలు పుంజుకున్నాయి.

మరోవైపు, భారత మార్కెట్లో ఆదాయాలు రూ. 690 కోట్లుగా నమోదయ్యాయి. రెండో త్రైమాసికంలో దేశీ మార్కెట్లో కొత్తగా 6 ఉత్పత్తులు ప్రవేశపెట్టామని సౌమేన్‌ చెప్పారు. దువ్వాడ ప్లాంటులో అమెరికా ఎఫ్‌డీఏ ఆడిట్‌ కొనసాగుతోందని, నియంత్రణ సంస్థలపరమైన అంశాలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు