డాక్టర్ రెడ్డీస్ లాభం 579 కోట్లు

10 Feb, 2016 00:41 IST|Sakshi
డాక్టర్ రెడ్డీస్ లాభం 579 కోట్లు

వర్ధమాన దేశాలు దెబ్బతీసినా ఆదుకున్న దేశీయ వ్యాపారం
34 శాతం  వృద్ధితో రూ. 580 కోట్లకు...

మొత్తం ఆదాయం రూ.3,986 కోట్లు; 3శాతం వృద్ధి
యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరికలపై సానుకూలంగా స్పందిస్తున్నాం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; రష్యా, ఇతర వర్ధమాన దేశాల వ్యాపారం దెబ్బతీసినా దేశీయ వ్యాపారం ఆదుకోవడంతో డాక్టర్ రెడ్డీస్ స్థిరమైన ఫలితాలను ప్రకటించగలిగింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నికర లాభం స్వల్పంగా ఒక శాతం పెరిగి రూ. 574 కోట్ల నుంచి రూ. 579 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 3 శాతం వృద్ధితో రూ. 3,843 కోట్ల నుంచి రూ. 3,968 కోట్లుగా నమోదయ్యింది. వర్ధమాన దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమన ప్రభావం ఫలితాలపై పడినట్లు డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ అండ్ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు.

 సమీక్షా కాలంలో రష్యా, వెనెజులాతో సహా ఇతర వర్థమాన దేశాల వ్యాపారం 28 శాతం క్షీణించి రూ. 884 కోట్ల నుంచి రూ. 640 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశీయంగా అమ్మకాలు 34 శాతం పెరిగి రూ. 433 కోట్ల నుంచి రూ. 580 కోట్లకు పెరిగాయి. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో ఇండియాలో 5 ఉత్పత్తులు విడుదల చేయడం వల్ల వ్యాపారం వృద్ధి చెందడానికి కారణంగా పేర్కొన్నారు. కీలకమైన ఉత్తర అమెరికా వ్యాపారం 18 శాతం వృద్ధితో రూ. 1,942 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో ఆర్‌అండ్‌డీ కేటాయింపులు 5.1 శాతం క్షీణించి రూ.409 కోట్లకు పరిమితమయ్యింది. ఈ త్రైమాసికంలో మొత్తం నాలుగు ఔషధాలకు అనుమతులు లభించాయి.

 దిద్దుబాటు చర్యలు
మూడు యూనిట్లకు జారీ చేసిన హెచ్చరికల లేఖపై స్పందించామని, యూఎస్‌ఎఫ్‌డీఏ సూచనల మేరకు తగు చర్యలు చేపట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. హెచ్చరికల తర్వాత గడువు విధించిన డిసెంబర్ 7లోగా వివరణ జారీ చేశామని, అంతే కాకుండా 45 రోజుల్లో చేపట్టిన దిద్దుబాటు చర్యలను తెలియచేస్తూ మరో లేఖ రాసినట్లు తెలిపారు. తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ త్వరలోనే మరో లేఖ రాయనున్నట్లు తెలిపారు. తాము తీసుకున్న చర్యలకు యూఎస్‌ఎఫ్‌డీఏ సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ హెచ్చరికలు, ఆయిల్ ధరలు తగ్గడం వంటి కారణాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు