7% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం

30 Jan, 2015 01:49 IST|Sakshi
7% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం

క్యూ3లో నికర లాభం రూ. 574 కోట్లు...
రష్యా వ్యాపారంలో 10 శాతం క్షీణత
9% వృద్ధితో రూ. 3,843 కోట్లకు చేరిన కంపెనీ ఆదాయం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభంలో 7% క్షీణతను  నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 618 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 574 కోట్లకు పడిపోయింది.

ప్రధాన ఆదాయ వనరైన అమెరికా మార్కెట్లో వృద్ధి అంతగా లేకపోవడం, ఇదే సమయంలో రష్యా వ్యాపారంలో 10%క్షీణత, ఆర్‌అండ్‌డీ వ్యయం పెరగడం లాభాలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి గురువారంనాడిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం 9 శాతం పెరిగి రూ. 3,534 కోట్ల నుంచి రూ. 3,843 కోట్లకు పెరిగింది. డాక్టర్ రెడ్డీస్ ప్రధాన ఆదాయ వనరైన గ్లోబల్ జెనరిక్ వ్యాపారం 8 శాతం పెరిగి రూ. 2,936 కోట్ల నుంచి రూ. 3,169 కోట్లకు చేరింది.

ఇందులో 53 శాతం వాటా కలిగిన ఉత్తర అమెరికా మార్కెట్లో మాత్రం కేవలం నాలుగు శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం, ధరలపై ఒత్తిడి ఉండటం లాభాలపై ప్రభావం చూపిందన్నారు. గతేడాదితో పోలిస్తే  అభివృద్ధి, పరిశోధనల కేటాయింపులు (ఆర్ అండ్ డీ) 45 శాతం పెంచినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో ఆర్ అండ్ డీపై రూ. 430 కోట్లు వ్యయం చేశారు.

అలాగే ఈ త్రైమాసికంలో కొత్తగా ఆరు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయగా, రెండు ఏఎన్‌డీఏలను ఫైల్ చేసినట్లు ముఖర్జీ తెలిపారు. ప్రస్తుతం 68 ఏఎన్‌డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి వచ్చిన అనుమతులను బట్టి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఈ సమీక్షా కాలంలో దేశీయ వ్యాపారం 11 శాతం వృద్ధితో రూ. 485 కోట్ల నుంచి రూ. 526 కోట్లకు చేరింది. మార్కెట్ అంచనాల కంటే లాభాల్లో క్షీణత తక్కువగా ఉండటంతో గురువారం బీఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు ధర సుమారు నాలుగు శాతం పెరిగి రూ. 3,359 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు