డ్రాగన్.. షాక్!

9 Jul, 2015 01:11 IST|Sakshi
డ్రాగన్.. షాక్!

గ్రీస్ ఎఫెక్ట్ నుంచి తేరుకుంటున్న సమయంలో భారత్ మార్కెట్‌కు దెబ్బ
సెన్సెక్స్ 484 పాయింట్లు డౌన్; 27,688 వద్ద క్లోజ్ 
148 పాయింట్లు తగ్గి 8,363కు నిఫ్టీ
 
 కరిగిపోయిన లోహ షేర్లు...
 లోహాలను ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే చైనాలో స్టాక్ మార్కెట్ భారీగా పతనం కావడం లోహ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పతనం కారణంగా చైనాలో మందగమనం చోటు చేసుకునే అవకాశాలున్నాయన్న ఆందోళనతో లోహ షేర్లు కరిగిపోయాయి. వేదాంత 7.8 శాతం, సెయిల్ 6 శాతం, హిందాల్కో 5 శాతం, టాటా స్టీల్ 4.7%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3.1 శాతం, ఎన్‌ఎండీసీ 2.3 శాతం, హిందుస్తాన్ జింక్ 1.9 శాతం, నాల్కో 1.9%, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 1% చొప్పున నష్టపోయాయి.

 ఒకే ఒక ‘షేర్’: ఒక్క హిందుస్తాన్ యూనిలీవర్ మినహా మిగిలిన 29 సెన్సెక్స్ షేర్లు నష్టపోయాయి. దీపక్ ఫెర్టిలైజర్స్  ప్లాంట్‌కు గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలన్న ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలతో ఈ షేర్ దాదాపు 8% లాభపడి రూ.143 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 13 శాతం ఎగసింది. డీలిస్టింగ్ వార్తలతో ఎస్సార్ ఆయిల్ షేర్ 4% వృద్ధితో రూ.189 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.197)ను తాకింది. ఈ నెల 3న రూ.148 వద్ద ఉన్న ఈ షేర్ కేవలం 4 ట్రేడింగ్ సెషన్లలో 33% పెరగడం విశేషం.

 లక్ష కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరి: స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.33 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. బీఎస్‌ఈలో లిస్టయిన అన్ని షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.102.55 లక్షల కోట్లకు పడిపోయింది.
 
 గ్రీస్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత స్టాక్ మార్కెట్‌పై చైనా షాంఘై సూచీ భారీ పతనం తీవ్రమైన ప్రభావం చూపింది.  చైనా స్టాక్ మార్కెట్ 6 శాతానికి పైగా క్షీణించడం, అదేబాటలో ఇతర ఆసియా మార్కెట్లు పతనంకావడం,  గ్రీస్ సంక్షోభం మరింత ముదరనున్నదన్న ఆందోళనలతో బుధవారం భారత్ మార్కెట్ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 28,000, నిఫ్టీ 8,400 స్థాయిల దిగువకు పడిపోయాయి. లోహ, వాహన షేర్లతో సహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 484 పాయింట్ల నష్టం(1.72%)తో 27,688 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 148 పాయింట్లు(1.74%) నష్టపోయి 8,363 పాయిం ట్ల వద్ద ముగిశాయి.  డాలర్‌తో రూపాయి మారకం విలువ పడపోవడం కూడా ప్రభావం చూపింది. అన్ని రంగాల సూచీలు నష్టాల పాలయ్యాయి.

 మరింత పతనం...!
 నష్టాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 536 పాయింట్లు క్షీణించి 27,636 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పతనం కావడం నెలలో ఇదే మొదటిసారి. ఇక నిఫ్టీ 8,458-8,342 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి 148 పాయింట్ల నష్టంతో 8,363 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా ఒడిదుడుకుల కారణంగా స్టాక్ మార్కెట్ మరింతగా పతనమవుతుందని నిపుణులంటున్నారు. గురువారం నుంచి టీసీఎస్‌తో ప్రారంభం కానున్న ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఆర్థిక ఫలితాలు, గ్రీస్, చైనా అంశాలు భవిష్యత్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు.

 ఏడాది కనిష్టానికి టాటా మోటార్స్
 చైనాలో లగ్జరీ కార్ల మార్కెట్‌లో మందగమనం చోటు చేసుకుంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహన విక్రయాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందనే అంచనాలతో టాటా మోటార్స్ షేర్ భారీగా పతనమైంది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిని(రూ.400) తాకిన ఈ షేర్ చివరకు 6% నష్టపోయి రూ.405 వద్ద ముగిసింది.  యస్ బ్యాంక్ టార్గెట్ ధరను రూ.1000 నుంచి రూ.740కు యూబీఎస్ తగ్గించడంతో ఈ షేర్ 7.4% క్షీణించి రూ.797 వద్ద ముగిసింది. 50 షేర్ల నిఫ్టీలో 3 మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.354 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.347 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
 
 ప్రపంచానికి చైనా బాధ
 చైనా స్టాక్ మార్కెట్లో 3 వారాల్లో 3.2 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరి
  ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు గ్రీస్‌కంటే ఇప్పుడు చైనాయే పెద్ద తలనొప్పిగా పరిణమించింది. చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్... బుధవారం ఆసియా మార్కెట్లను వణికించిన ఈ చైనా స్టాక్ మార్కెట్ ఏడాది కాలంలో 155 శాతం వృద్ధిని సాధించిన తర్వాత గత మూడు వారాలుగా పతనమవుతూ వస్తోంది. ఈ పతనం బుధవారం పరాకాష్టకు చేరింది. 220 పాయింట్లు(6.2 శాతం)  పతనమై 3,506 పాయింట్లకు చేరింది. గత నెల 12న ఏడాది గరిష్ట స్థాయి అయిన 5,166 పాయింట్లను షాంఘై తాకింది. అప్పటినుంచి చూస్తే 3 వారాల్లో 30 శాతానికి పైగా పడింది.  

 ఎందుకీ పతనం...: ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు చైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. అయితే తాజాగా మార్జిన్ ట్రేడింగ్, షార్ట్ సెల్లింగ్ నిబంధనలను చైనా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ కఠినతరం చేసింది. దీంతోపాటు షేర్ల విలువలు అధికంగా ఉన్నాయన్న ఆందోళనల  కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. చైనా మార్కెట్ల భారీ పతనానికి ఇది తక్షణ ప్రధాన కారణమని నిపుణులంటున్నారు.  మూడు వారాల్లో 30% పతనం కారణంగా ఇప్పటికే 3.2 లక్షల కోట్ల డాలర్ల నష్టాలు వచ్చాయని, ఈ నష్టాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్న ఆందోళనతో ఆ మార్కెట్లో అమ్మకాల సునామీ తలెత్తింది.  మార్జిన్ ఫైనాన్సింగ్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మరీ స్టాక్ మార్కెట్లో అక్కడి రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు కంపెనీలూ పెట్టుబడి చేశాయి. ఇప్పుడా పెట్టుబడులే, అమ్మకాల రూపంలో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.

 ఫలించని ప్రయత్నాలు.. : ఈ పతనాన్ని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం చాలా చర్యలను ప్రకటించింది. కానీ అవేవీ ఇన్వెస్టర్ల అమ్మకాల వెల్లువను ఆపలేకపోయాయి. ఈ స్టాక్ మార్కెట్లో లిస్టయిన దాదాపు 40 శాతానికి (దాదాపు 1,300కు) పైగా కంపెనీల్లో ట్రేడింగ్‌ను ఆయా కంపెనీలే స్వచ్చందంగా సస్పెండ్ చేసుకున్నాయి. ఇన్ని కంపెనీల ట్రేడింగ్ సస్పెండ్ కావడం  షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఈ షేర్లు అందుబాటులో లేకపోవడంతో రిస్క్‌ను తగ్గించుకోవడానికి అందుబాటులో ఉన్న బ్లూ చిప్ షేర్లతో సహా అన్ని షేర్లలో ఏ ధరకు బడితే అ ధరకు ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేశారు. 

వెయ్యికి పైగా షేర్లు రోజువారీ పరిమితి 10 శాతం వరకూ నష్టపోయాయి. గత ఏడాది కాలంలో వచ్చిన షాంఘై ర్యాలీకి ఎలాంటి ఫండమెంటల్ పునాది లేదని నిపుణులంటున్నారు. మార్కెట్లకు అనుకూలమైన నిర్ణయాలను చైనా ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ, షాంఘై భారీ పతనం ఇప్పటికే మందగమనంలో ఉన్న చైనాపై మరింత ప్రభావం చూపనున్నదని అంచనా. ఈ ఉత్పాతం చైనా ఆర్థిక వ్యవస్థ అంతటికీ , ఆ తర్వాత ప్రపంచ దేశాలకు వ్యాపించే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది గ్రీస్ కంటే పెద్ద సంక్షోభం కానున్నదని నిపుణులంటున్నారు.
 
 వణికిన ఆసియా మార్కెట్లు
 చైనా మార్కెట్ పతనాన్ని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. షాంఘై సూచీ 6 .2% నష్టపోవడంతో ఆ ప్రభావం మిగిలిన ఆసియా మార్కెట్లపై పడింది. హాంగ్‌కాంగ్  హాంగ్‌సెంగ్  6%, జపాన్ నికాయ్ 3%, తైవాన్ మార్కెట్ 3%,  సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 1.7%, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 1 శాతం చొప్పున నష్టపోయాయి.

మరిన్ని వార్తలు