కోర్టు జప్తుల్లోఉన్న రూ.2,000 కోట్లపై దృష్టి పెట్టండి

8 Jun, 2016 01:30 IST|Sakshi
కోర్టు జప్తుల్లోఉన్న రూ.2,000 కోట్లపై దృష్టి పెట్టండి

ముందుగా వాటిని రికవరీ చేసుకోండి..
‘కింగ్‌ఫిషర్’ మాల్యా కేసులో బ్యాంకులకు డీఆర్‌టీ సూచన

బెంగళూరు: కింగ్‌షిఫర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా కేసులో బ్యాంకులకు డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్‌టీ) మంగళవారం కీలక సూచనలు చేసింది. రూ.9,000 కోట్ల మేర రుణ బకాయిల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవాలంటే.. ముందుగా ఈ కేసుకు సంబంధించి వివిధ కోర్టుల జప్తుల్లో ఉన్న దాదాపు రూ.2,000 కోట్ల మొత్తాన్ని రికవరీ చేసుకోవడంపై దృష్టిసారించాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు డీఆర్‌టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) బెనకనహళ్లి సూచించారు.

దీన్ని పరిష్కరించుకోవడానికి బ్యాంకులన్నీ కలసికట్టుగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకుల కన్సార్సియం, డియాజియో(హోల్డింగ్స్) నెదర్లాండ్స్ తమ పిటిషన్లను ప్రాధాన్య ప్రాతిపదికన విచారించాలంటూ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన పీఓ తాజా వ్యాఖ్యలు చేశారు.  ఈ కేసులో కోర్టుల దగ్గరున్న రూ.2,000 కోట్లను రికవరీ చేసుకోగలిగితే వడ్డీరూపంలో రూ.200-300 కోట్లు లభిస్తాయని.. నష్టం కొంతైనా పూడుతుందని బెనకనహళ్లి బ్యాంకుల కన్సార్షియంకు సూచించారు.

మరిన్ని వార్తలు