జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు మరో ఎదురు దెబ్బ

19 Dec, 2018 16:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జాన్సన్‌ బేబీ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌  ఆనవాళ్లున్నాయన్న సమాచారంతో దేశీయ  ఔషధ నియంత్రణ అధికారులు స్పందించారు.  హిమాచల్‌ ప్రదేశ్‌లో జాన్సన్‌ ఫ్యాక్టరీలో జాన్సన్‌  బేబీ పౌడర్‌ శాంపిళ్లను  డ్రగ్‌ అధికారులు సీజ్‌ చేసినట్టు సమాచారం.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బడ్డీ ప్లాంట్‌నుంచి ఈ నమూనాలు  సేకరించినట్టు పేరు వెల్లడించడానికి అంగీకరించని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీ) అధికారి ఒకరు మంగళవారం  తెలిపారు. అలాగే వార్తా కథనాల ఆధారంగా శాంపిళ్లను సీజ్‌ చేయాల్సిందేగా ఆదేశించానని తెలంగాణాకు చెందిన రీజనల్‌ డ్రగ్‌ ఆఫీసర్‌ సురేంద్రనాథ్‌ సాయి ధృవీకరించారు. పరీక్షల అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని ప్రభావానికి లక్షలాదిమంది పసిపిల్లలు గురి కానున్నారనే అంశం బాధిస్తోందన్నారు. అయితే తాజా పరిణామంపై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఇంకా స్పందించలేదు.

మరోవైపు ఈ వ్యవహరాన్ని పరిశీలించేందుకు సుమారు 100మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించినట్టు వార్తలొచ్చాయి. జాన్సన్‌ ఇండియాతో సంబంధమున్న వేర్వేరు ఉత్పాదక  యూనిట్లు, హోల్‌సేలర్స్‌, పంపిణీదారులను పరిశీలించడానికి నియమించారు. దీనిపై సంప్రదించినప్పుడు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారని రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది. అయితే ఈ రిపోర్టులో నివేదించిన అంశాలు చాలా ఆందోళన కరమని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిపింది.

కాగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్‌కారకాలు ఉన్నాయన్న సంగతిని మూడు దశాబ్దాలుగా కంపెనీ దాచి పెట్టిందంటూ ఇటీవల రాయిటర్స్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ ప్రతినిధులు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు