రియల్‌కు ఈ-కామర్స్ దన్ను!

21 Feb, 2015 02:40 IST|Sakshi
రియల్‌కు ఈ-కామర్స్ దన్ను!

ప్రతీది నట్టింట్లోకి వచ్చి వాలాలనే యువత ఆలోచనలకు అనుగుణంగానే విస్తరిస్తున్న ఈ-కామర్స్ కంపెనీలు.. స్థిరాస్తి రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కొన్నేళ్లుగా రాజకీయ అస్థిరత, ప్రతికూల ఆర్ధిక పరిస్థితుల కారణంగా విస్తరణ ప్రణాళికలను పక్కన పెట్టేసిన కంపెనీలు.. ఈ ఏడాది ఆఫీసుల స్థాపన, విస్తరణ యోచన చేస్తున్నాయి. దీంతో దేశంలో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ క్రమంగా పెరుగుతోంది.
 
- దేశంలో ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతోన్న గిరాకీ
- గతేడాది 29.5 మిలియన్ చ.అ.ల్లో విస్తరించిన ఈ-కామర్స్ కంపెనీలు

సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా ఈ-కామర్స్ వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మొత్తం రిటైల్ వ్యాపారం రూ.38 లక్షల కోట్లు కాగా.. ఇందులో ఈ-కామర్స్ వ్యాపారం వాటా దాదాపు లక్ష కోట్లు. దీన్లో ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం రూ.24,000 కోట్లు. అందుకే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జబాంగ్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు తమ కార్యాలయాలు, గిడ్డంగుల స్థాపనకు, విస్తరణకు సిద్ధమయ్యాయి. 2013లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ-కామర్స్ కంపెనీల ఆఫీసు స్పేస్ మొత్తం 22.2 మిలియన్ చ.అ.లుగా ఉంటే.. గతేడాది 29.5 మిలియన్ చ.అ.లకు పెరిగిందని కుష్‌మెన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. గతేడాది నిధుల సమీకరణ, ఒప్పందాలపై దృష్టిసారించిన ఈ కంపెనీలు.. ఈ ఏడాది ఆఫీసు స్పేస్‌ను అద్దెకు తీసుకోవటంపై దృష్టిసారించాయని పేర్కొంది.
 
ఇతర నగరాల్లో ఆఫీస్ స్పేస్: 2013 ఢిల్లీలో 84,000 చ.అ.ల్లో విస్తరించి ఉన్న ఈ-కామర్స్ ఆఫీస్ స్పేస్.. గతేడాదికి 5,67,499 చ.అ.లకు చేరింది. 2013లో బెంగళూరులో 4,53,495 చ.అ.లుంటే.. గతేడాదికి 6,22,811 చ.అ.లకు పెరిగింది. ఇదిలా ఉంటే ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం ఆశ్చర్యకరమైన గణాంకాలు కన్పించాయని కుష్‌మెన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక పేర్కొంది. రెండేళ్లుగా ముంబై, కోల్‌కత్తా నగరాల్లో ఆఫీసు స్పేస్ గిరాకీలో ఎలాంటి మార్పు కన్పించలేదని స్పష్టం చేసింది. గతేడాది ముంబైలో ఈ-కామర్స్ కంపెనీల ఆఫీసు స్పేస్ 27,000 చ.అ.లుగా ఉంది. కోల్‌కతాలో 4,600 చ.అ.లుగా ఉందని నివేదిక చెబుతోంది.
 
హైదరాబాద్‌లో రెట్టింపు: 2013తో పోల్చితే గతేడాది హైదరాబాద్‌లో ఈ-కామర్స్ కంపెనీల ఆఫీసు స్పేస్ గిరాకీ రెట్టింపయ్యిందని నివేదిక పేర్కొంది. 2013లో 4,100 చ.అ.లుగా ఉన్న ఆఫీస్ స్పేస్.. గతేడాది 8,542 చ.అ.లకు పెరిగింది. అయితే సమీప భవిష్యత్తులో హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం, త్వరతగతిన అనుమతులు జారీ చేయటం వంటివి ఇందుకు కారణమని యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ డెరైక్టర్ కళిశెట్టి పద్మభూషణ్ ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు.

‘‘దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ లాజిస్టిక్ హబ్‌గా ఎదుగుతోంది. హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారం కూడా. అలాగే నాగార్జున్‌సాగర్ రోడ్ మీదుగా చెన్నైకి, రాజేంద్రనగర్ మీదుగా బెంగళూర్‌కు, మెదక్ మీదుగా ముంబైలకు రవాణా సదుపాయం ఉండటం ఈ-కామర్స్ కంపెనీలకు కలిసొచ్చే అంశాలని’’ చెప్పారు. త్వరలోనే 160 కి.మీ. పొడవునా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రానుంది. దీంతో నగరం చుట్టూ ఈ-కామర్స్ కంపెనీలు గిడ్డంగులను ఏర్పాటుచేసే అవకాశముంది. ప్రత్యేకించి బెంగళూర్, నాగ్‌పూర్, ముంబై హైవేలు గిడ్డంగుల స్థాపనకు అనుకూలమని వారి అభిప్రాయం.
 
36.8 మిలియన్ చ.అ.లకు: కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించేలా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటి కారణంగా రానున్న రోజుల్లో రియల్ వ్యాపారం పుంజుకుంటుందని స్థిరాస్తి నిపుణులు అభిప్రాయడుతున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి దేశం మొత్తం మీద ఈ-కామర్స్ కంపెనీల ఆఫీస్ స్పేస్ 36.8 మిలియన్ చ.అ.లకు.. 2016 నాటికి 40.1 మిలియన్ చ.అ.లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు