ఈ కామర్స్‌కు ఫ్యాషన్, మొబైల్స్‌ కిక్కు

18 Dec, 2018 00:42 IST|Sakshi

అధికంగా అమ్ముడయ్యేవి ఇవే

ఇపుడిపుడే ఊపందుకుంటున్న ఆన్‌లైన్‌ గ్రోసరీ విక్రయాలు...

ట్రావెల్, ఐటీ ఉత్పత్తుల  అమ్మకాలూ అధికమే

నీల్సన్‌ సర్వేలో ఆసక్తికర అంశాలు  

ముంబై: మన దేశంలో ఆన్‌లైన్‌లో హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యేవి ఏవనుకుంటున్నారు..? ఫ్యాషన్‌    వస్త్రాలు, మొబైల్స్‌... ఇవే కాదు ఐటీ ఉత్పత్తులు, ట్రావెల్‌ టికెట్లతోపాటు నిత్యం ఇంట్లో ఉపయోగించే గ్రోసరీ వస్తువులు కూడా భారీగా అమ్ముడుపోతున్నాయి. నీల్సన్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ కామర్స్‌ సంస్థలు దేశీయ ఎఫ్‌ఎంసీజీ విభాగంలో తమ వాటాను మూడు రెట్లు పెంచుకోవడం ఆన్‌లైన్‌ షాపింగ్‌ డిమాండ్‌ను తెలియజేస్తోంది. ఈ మేరకు ‘2018 నీల్సన్‌ కనెక్టెడ్‌ కామర్స్‌ రిపోర్ట్‌’ను నీల్సన్‌ విడుదల చేసింది. ఈ సంస్థ వినియోగదారుల ఆన్‌లైన్‌ కొనుగోలు అలవాట్లను అధ్యయనం చేసింది.  

►ఇంటర్నెట్‌ అనుసంధానత కలిగిన వారిలో 98 శాతం మంది ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను కొనుగోళ్లు చేస్తున్నట్టు తెలిసింది.  
►ఆన్‌లైన్‌ అమ్మకాల్లో ట్రావెల్‌ (69 శాతం), ఫ్యాషన్‌(66 శాతం), ఐటీ/ మొబైల్స్‌(63 శాతం) అతిపెద్ద వాటా కలిగి ఉన్నాయి. వీటితోపాటు ప్యాకేజ్డ్‌ గ్రోసరీ ఉత్పత్తులు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.  
​​​​​​​►40 శాతం మంది కస్టమర్లు తాజా గ్రోసరీ ఉత్పత్తులు, శిశు, చిన్నారుల ఉత్పాదనలను కొనుగోలు చేశామని వెల్లడించారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు ఎన్నో విభాగాల్లోకి విస్తరించగా, తాజా, ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులపై ఎక్కువ మందిలో ఆసక్తి పెరిగింది. 
​​​​​​​►అంతర్జాతీయ ఆన్‌లైన్‌ గ్రోసరీ కొనుగోళ్లు గత రెండేళ్లలో 15 శాతం పెరిగాయి.  

తొలి ఆన్‌లైన్‌ షాపింగ్‌ వీటిల్లోనే... 
‘‘మొదటిసారి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారు ట్రావెల్, ఫ్యాషన్, ఐటీ/ మొబైల్‌ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. అలవాటు అయిన తర్వాత, నమ్మకం పెరిగిన తర్వాత సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ, చిన్నారుల ఉత్పత్తుల విభాగాల్లోకి వారి కొనుగోళ్లు విస్తరిస్తున్నాయి’’అని నీల్సన్‌ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సమీర్‌శుక్లా తెలిపారు. కొనుగోళ్ల పరిమాణం పెరిగినప్పటికీ, భారత్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేసే వారి శాతం 2018 ఏడాదిలో తగ్గినట్టు శుక్లా తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఎన్నో విభాగాల్లో కొనుగోళ్లకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. నాణ్యత పరమైన భరోసా ఇస్తే ఆన్‌లైన్‌లో తాజా, ప్యాకేజ్డ్‌ గ్రోసరీ ఉత్పత్తుల కొనుగోళ్లకు వినియోగదారులు మరింత ముందుకు వస్తారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు