ఉద్యోగుల రవాణాకు ఈ–వాహనాలు

1 Jun, 2019 07:36 IST|Sakshi

నెల రోజుల్లో హైదరాబాద్‌లో రూట్‌మ్యాటిక్‌ సేవలు షురూ

తొలుత 10.. సెప్టెంబర్‌ కల్లా 600 వాహనాలు అందుబాటులోకి

ప్రస్తుతం 12 నగరాల్లో సేవలు; రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణం

ఈ ఏడాది ముగింపులోగా రూ.175 కోట్ల నిధుల సమీకరణ

‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ సురాజిత్‌ దాస్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉద్యోగులకు రవాణా సేవలందిస్తున్న రూట్‌మ్యాటిక్‌ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తొలుత 10 వాహనాలతో నెల రోజుల్లో సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే సాంకేతికత, మార్కెటింగ్‌ నిపుణులు నియామకం పూర్తయింది. మైండ్‌ ట్రీతో ఒప్పందం చేసుకున్నామని, మరొక నాలుగైదు కంపెనీలతో చర్చలు చివరి దశలో ఉన్నాయని,  సెప్టెంబర్‌ నాటికి 600ల వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ కో–ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సురాజిత్‌ దాస్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు సురాజిత్‌ దాస్, శ్రీరామ్‌ కన్నన్‌లు బెంగళూరు కేంద్రంగా 2013 డిసెంబర్‌లో రూట్‌మ్యాటిక్‌ను ప్రారంభించారు. రూట్‌మ్యాటిక్‌ రెండు రకాల సేవలందిస్తుంది. 1. ఉద్యోగుల రవాణా కోసం వాహన సర్వీసులు, 2. ట్రాన్స్‌పోర్ట్‌ ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌లు. మొదటి సర్వీస్‌లో కంపెనీలకు జీపీఎస్‌ ఆధారిత పాయింట్‌ టు పాయింట్‌ సేవలుంటాయి. అంటే వాహనాన్ని బట్టి కాకుండా అందులో ప్రయాణించే ఉద్యోగుల దూరాన్ని బట్టి చార్జీలుంటాయన్నమాట. దీంతో కంపెనీలకు వ్యయ భారం తగ్గుతుంది. ఒక్క ఉద్యోగికి నెలకు రూ.4,500–6,000 మధ్య ఉంటాయి. ఇక, రెండో విభాగంలో కంపెనీలకు ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వహణ, టెక్నాలజీ సేవలందిస్తుంది. వీటి చార్జీలు ఒక్క ఉద్యోగికి నెలకు రూ.4,000–7,000 మధ్య ఉంటాయి.

60కి పైగా కంపెనీలు కస్టమర్లు..
ప్రస్తుతం ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, మధురై వంటి 12 నగరాల్లో సేవలందిస్తుంది. సిస్కో, బార్క్‌లెస్, ఇన్ఫోసిస్, అమెజాన్‌ వంటి 60కి పైగా కార్పొరేట్‌ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం మాకు 700లకు పైగా వాహనాలు, 1.50 లక్షల మంది కస్టమర్లున్నారు. నెలకు 10 లక్షల కి.మీ. ట్రాన్స్‌పోర్టేషన్‌ జరుగుతుంది. ఈ ఏడాది ముగింపు నాటికి 4 వేల వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలన్నది మా లక్ష్యం. ఏటేటా రెట్టింపు అదాయాన్ని నమోదు చేస్తున్నాం. 

రూ.175 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం మా కంపెనీలో 200 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు లోగా మరొక 100 మందిని నియమించుకుంటాం. ‘‘ఇప్పటివరకు 31 కోట్ల నిధులను సమీకరించాం. బ్లూమ్‌ వెంచర్స్, దుబాయ్‌కు చెందిన వ్యామ్‌ క్యాపిటల్, కెఫే కాఫీ డే మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నరేష్‌ మల్హోత్ర ఈ పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముగింపు లోగా రూ.175 కోట్లు (25 మిలియన్‌ డాలర్లు) నిధులను సమీకరించనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయని’’ సురాజిత్‌ వివరించారు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీతెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

మరిన్ని వార్తలు