రుతుపవనాలు, బ్లూచిప్ కంపెనీల ఫలితాలే కీలకం

22 May, 2016 17:08 IST|Sakshi

న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాంటి బ్లూచిప్ కంపెనీల రాబడులు, రుతుపవనాల పురోగతి ఈ వారం స్టాక్ మార్కెట్లకు కీలక అంశాలుగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపుతూ మార్కెట్లను ఒడిదుడుకులకు లోను చేసే అవకాశాలున్నట్టు పేర్కొంటున్నారు. రుతుపవనాల పురోగతి వివరాలు, ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్స్, స్థూల ఆర్థిక డేటా, 2016 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ వారం దేశీయ సూచీలను నిర్దేశిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్ లైన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్ సింగానియా తెలిపారు.

బీపీసీఎల్, టాటా పవర్, సిప్లా, టెక్ మహింద్రా, బజాజ్ ఆటో, గెయిల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్, ఎస్ బీఐ, కోల్ ఇండియాలు ఈ వారంలో మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆశించిన ఫలితాలను విడుదలచేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగానికి అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్ బీఐ ఫలితాలపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టిసారించనున్నారని రిలయన్స్ సెక్యురిటీస్ తెలిపింది. కొన్ని వారాల వరకూ మార్కెట్లకి, ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలే కీలక అంశంగా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతవారం రెండు దేశీయ సూచీలు సెన్సెక్స్, నిప్టీలు నష్టాలు పాలయ్యాయి. సెన్సెక్స్ 187.67 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 65.20 పాయింట్లు నష్టపోయింది.

మరిన్ని వార్తలు