చిన్న నగరాల్లో ఈజీబై స్టోర్లు

6 Oct, 2016 02:31 IST|Sakshi
చిన్న నగరాల్లో ఈజీబై స్టోర్లు

రెండేళ్లలో మొత్తం 50 కేంద్రాలు
కంపెనీ బిజినెస్ హెడ్ ఆనంద్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్ దుస్తుల రంగంలో ఉన్న ఈజీబై రెండేళ్లలో స్టోర్ల సంఖ్యను 50కి చేర్చనుంది. ల్యాండ్‌మార్క్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ప్రస్తుతం 15 ఔట్‌లెట్లు ఉన్నాయి. కొత్త దుకాణాలన్నీ దక్షిణాది రాష్ట్రాల్లోనే వస్తాయని ఈజీబై బిజినెస్ హెడ్ ఆనంద్ అయ్యర్ తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో విస్తరించిన తర్వాతే మరో రాష్ట్రంలో అడుగుపెడుతున్నట్టు వెల్లడించారు. ఫ్రాంచైజీ అయిన వి-రిటైల్ తెలంగాణలో అతిపెద్ద ఈజీబై స్టోర్‌ను హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ప్రారంభించిన సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక దుకాణాన్ని తెరుస్తామని చెప్పారు.

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫ్రాంచైజీ విధానంలోనే వీటిని నెలకొల్పుతామన్నారు. ‘ఒక్కో స్టోర్‌కు రూ.1 కోటి దాకా వ్యయం అవుతుంది. సరుకు నిర్వహణ పూర్తిగా కంపెనీయే చూసుకుంటుంది. థర్డ్ పార్టీ ప్లాంట్ల నుంచి నాణ్యమైన దుస్తులను కొనుగోలు చేస్తున్నాం’ అని వివరించారు. ప్రస్తుతం అయిదు స్టోర్లు నిర్వహిస్తున్నామని, డిసెంబరుకల్లా మరో మూడు స్టోర్లు ప్రారంభిస్తామని వి-రిటైల్ డెరైక్టర్ మధుసూధన్ తెలిపారు. దుస్తుల ధర రూ.69-699 మధ్య ఉంది.

మరిన్ని వార్తలు