ఈబీ5 పెట్టుబడులతో అమెరికాలో ప్రయోజనాలు

21 Jun, 2019 11:16 IST|Sakshi

అక్టోబర్‌ నుంచి పెరగనున్న పెట్టుబడుల పరిమితి

ఎంసీఎఫ్‌ఐ ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ రావు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికాలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అక్కడ స్థానికత్వ ప్రయోజనాలు పొందడానికి ఉపయోగపడే ప్రస్తుత ఈబీ5 విధానం గడువు త్వరలో ముగిసిపోనుందని మేరీల్యాండ్‌ సెంటర్‌ ఫర్‌ ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎంసీఎఫ్‌ఐ) ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ రావు తెలిపారు. ప్రస్తుత విధానం కింద 5 లక్షల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ సరిపోతుందని కొత్తగా అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే విధానం ప్రకారం ఇది 13.5 లక్షల డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పెట్టుబడి మొత్తం ఈ స్థాయిలో పెరిగితే భారత్‌ నుంచి వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య దాదాపు 80–90 శాతం తగ్గిపోవచ్చని రావు అంచనా వేశారు. అక్టోబర్‌లోగా దరఖాస్తు చేసుకున్నవారికి పాత పరిమితులే వర్తిస్తాయని, భారతీయ ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ విధానం కింద సమీకరించే పెట్టుబడులను ఉపాధి కల్పనకు ఊతమిచ్చే రియల్‌ ఎస్టేట్, నిర్మాణ తదితర రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయడం జరుగుతుంది. అమెరికాలో ఎక్కడైనా పనిచేసేలా ఇన్వెస్టరుకు గ్రీన్‌కార్డు లభిస్తుంది. ఇన్వెస్టరుతో పాటు వారి కుటుంబానికి కూడా స్థానికత ప్రయోజనాలు అందించే వెసులుబాటు ఈ విధానంలో ఉందని రావు చెప్పారు. అలాగే, నిర్దిష్ట సమయం తర్వాత పెట్టుబడిని కూడా తిరిగి పొందవచ్చు. 

అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ పొందే అవకాశం లేనివారు ఇలా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా గ్రీన్‌కార్డ్‌ను పొందేందుకు అగ్రరాజ్యం వెసులుబాటు కల్పిస్తోంది. ప్రస్తుతం సమీకరించే నిధులను మేరీల్యాండ్‌ రాష్ట్రం వెస్ట్‌ఫేలియా టౌన్‌ సెంటర్‌ నిర్మాణానికి ఉపయోగిస్తోందని, దీని విలువ సుమారు 226 మిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2021లో పూర్తయ్యే నాటికి 624 మిలియన్‌ డాలర్లకు చేరగలదని అంచనాలు ఉన్నట్లు రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ రాబడులు కూడా అందుకోవచ్చన్నారు. 

మరిన్ని వార్తలు