జీడీపీ వృద్ధి రేటు పెరుగుతోంది : ఆర్థిక సర్వే

29 Jan, 2018 13:12 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం 2019లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరుగుతుందని 2018 ఆర్థిక సర్వే అంచనావేసింది. జీఎస్టీ వంటి పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన అనంతరం మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో రియల్‌ జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ సర్వేను ప్రవేశపెట్టారు. 


ఆర్థిక వృద్ధి రేటు పెరగడానికి ప్రధాన కారణంగా జీఎస్టీ, బ్యాంక్ రీక్యాపిటలైజేషన్, సరళీకరణ, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరగడమని వెల్లడించింది.  వ్యవసాయం, విద్య, ఉపాధిలపై ఎక్కువగా దృష్టిసారించాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2016-17లో 8 శాతం పెరిగి 60.08 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇవి 55.56 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

కొన్నేళ్లుగా ప్రతికూలంగా ఉంటూ వస్తున్న ఎగుమతులు 2016-17లో సానుకూలంగా మారాయని, 2017-18లో మరింత పెరుగునున్నట్టు పేర్కొంటోంది. మొత్తంగా 2017-18లో ఎగుమతులు వృ‍ద్ధి రేటు 12.1 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. విదేశీ మారక నిల్వలు వార్షిక ప్రాతిపదికన 14.1 శాతం పెరిగి, 409.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్టు ఆర్థిక సర్వే తెలిపింది.

తయారీ రంగంపై ఓ గుడ్‌న్యూస్‌ను కూడా ఆర్థిక సర్వే ప్రకటించింది. తొలిసారి భారతీయ చరిత్రలో మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశీయ ఎగుమతుల్లో 70 శాతాన్ని నమోదుచేసినట్టు పేర్కొంది. 

ఆర్థిక సంవత్సరం 2018లో సేవల వృద్ధి 8.3 శాతం, పరిశ్రమల వృద్ధి 4.4 శాతం, వ్యవసాయ వృద్ధి 2.1 శాతంగా ఉన్నట్టు అంచనావేసింది. వచ్చే ఏడాది ఆర్థిక నిర్వహణ సవాల్‌గా నిలువనున్నట్టు రిపోర్టు చేసింది. గత ఆరేళ్లలో 2017-18 మధ్యకాలంలోనే ద్రవ్యోల్బణం సగటున కనిష్టంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఆయిల్‌ ధరలపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తంచేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సగటున క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 12 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఇలానే పెరుగుతూ వస్తూ ఉంటే... వచ్చే నెలల్లో 'పాలసీ విజిలెన్స్(విధాన నిఘా)‌' చేపట్టాలని పిలుపునిచ్చింది. 

50 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారులు

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత కొత్తగా పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారని, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కూడా పెరిగినట్టు ఆర్థిక సర్వే రిపోర్టు చేసింది. స్వచ్ఛంగా పన్ను చెల్లింపుదారులు కూడా భారీగా పెరిగాయని తెలిపింది. ముఖ్యంగా పెద్ద వ్యాపారుల నుంచి కొనుగోలు చేసే చిన్న వ్యాపారులు ఇన్‌ఫుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను ఆశిస్తున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషిస్తూ... బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. గత 12 ఏళ్ల నుంచి పార్లమెంట్‌లో ఇరుసభల్లో ఈ సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆధ్వర్యంలోని బృందం దీన్ని రూపొందించింది. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభ ఫిబ్రవరి 1కి(గురువారానికి) వాయిదా పడింది.

మరిన్ని వార్తలు