నిత్యావసరాలకు మాత్రమే ఓకే..

27 Mar, 2020 05:34 IST|Sakshi

ఇతర ఆర్డర్లకు నో.. ఈ–కామర్స్‌ సంస్థల నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో నిత్యావసర ఉత్పత్తులే సరఫరా చేయాలని ఈ–కామర్స్‌ సంస్థలు భావిస్తున్నాయి. నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోరాదని నిర్ణయించుకున్నాయి. ‘నిత్యావసరాలు, హెల్త్‌కేర్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కొనుగోలుదారులకు తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నాం. ఫ్యాషన్, మొబైల్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్‌ తదితర నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా కొత్త ఆర్డర్లు తీసుకోబోము‘ అని పేటీఎం మాల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. డెలివరీలు సత్వరం చేసేందుకు వెసులుబాటు లభించేలా ప్రభుత్వ వర్గాలు, లాజిస్టిక్స్‌ సంస్థలతో సంప్రతింపులు జరుపుతున్నట్లు వివరించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాలు, హ్యాండ్‌ శానిటైజర్లు మొదలైనవి తక్షణం సరఫరా చేయగలిగే విక్రేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.

ఆర్డర్ల డెలివరీల్లో జాప్యం: అమెజాన్‌
లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల కారణంగా ఆర్డర్ల డెలివరీల్లో మరికాస్త జాప్యం జరిగే అవకాశం ఉందని అమెజాన్‌ ఇండియా తన వెబ్‌సైట్లో పేర్కొంది. ‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ విధానంలో అత్యవసర ఉత్పత్తులకు మాత్రమే కొత్త ఆర్డర్లు తీసుకుంటున్నాం.  ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకుంటూ, సాధ్యమైనంత త్వరగా డెలివరీ సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని వివరించింది.  

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం..:  ఫ్లిప్‌కార్ట్‌.. నిత్యావసర సరుకుల డెలివరీ సేవలను ప్రారంభించింది. ‘ఆర్డర్ల ప్రాధాన్యాన్ని బట్టి సాధ్యమైనంత త్వరగా మీకు డెలివర్‌ చేస్తాము. ఇతర ఉత్పత్తులకు ఆర్డర్లు తాత్కాలికంగా తీసుకోవడం లేదు. కానీ వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాము‘ అని తమ వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. స్థానిక అధికారుల తోడ్పాటుతో కార్యకలాపాలన్నీ యథావిధిగా ప్రారంభించినట్లు ఆన్‌లైన్‌ గ్రోసరీ సంస్థ గ్రోఫర్స్‌ వెల్లడించింది. అయితే, గ్రోఫర్స్‌ పోటీ సంస్థ అయిన బిగ్‌బాస్కెట్‌ వెబ్‌సైట్‌ మాత్రం కొత్త కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం లేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా