ఫలితాలు, గణాంకాలు.. కీలకం

11 Jul, 2016 01:06 IST|Sakshi
ఫలితాలు, గణాంకాలు.. కీలకం

న్యూఢిల్లీ: పారిశ్రామిక, ద్రవ్యోల్బణ గణాంకాలు, నైరుతి రుతుపవనాల విస్తరణ, కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు.. ఈ వారం స్టాక్‌మార్కెట్‌కు కీలకాంశాలని నిపుణులంటున్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ,  విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు కదలికలు.. స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. పెద్ద కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి ఈ వారం నుంచి ప్రారంభం కానున్నది.  

నేడు(సోమవారం) ఇండస్‌ఇంద్ బ్యాంక్, ఈ నెల 14న టీసీఎస్, ఈ నెల 15న ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. ఈ ఫలితాల ప్రభావం ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ఉంటుంది. ఈ ఫలితాలతో పాటు ఈ నెల 12న మే నెల పారిశ్రామికోత్పత్తి, జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ  గణాంకాలు, ఈ నెల 14న జూన్ టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి.
 
ఫలితాలపైననే దృష్టి..
ఈ వారం నుంచి పెద్ద కంపెనీల ఫలితాల సీజన్ ప్రారంభమవుతుందని, ఇన్వెస్టర్ల దృష్టి అంతా ఈ ఫలితాలపై, ఈ ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ యాజమాన్యం చేసే వ్యాఖ్యలపై ఉంటుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. నేటి(సోమవారం) ట్రేడింగ్ ప్రారంభంలో గత శుక్రవారం వెల్లడైన అమెరికా ఉద్యోగ గణాంకాల ప్రభావం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. మరో 4-6 వారాల పాటు కంపెనీల క్యూ1 ఫలితాలే ఇన్వెస్టర్లకు ముఖ్యమైన విషయమని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్ పంకజ్ శర్మ చెప్పారు. ప్రభుత్వ సంస్కరణలు, విధానాల పట్ల ఇన్వెస్టర్లు నమ్మకంగా ఉన్నారని, మార్కెట్ ముందుకేనని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ డి. కె. అగర్వాల్ చెప్పారు.
 
ఒకింత ఒడిదుడుకులు
ఈ వారంలో యూరోప్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ల సమావేశాలు జరగనున్నాయని, ఈ సమావేశాల నేపథ్యంలో బ్రెగ్జిట్(యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) పరిణామాల ప్రభావంపై ఆందోళన నెలకొనవచ్చని, ఇది స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు కారణం కావచ్చని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ అంచనా వేస్తున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ సూచీలు ఒకింత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని కొందరు నిపుణుల భావన.

మరిన్ని వార్తలు