ఆర్థిక మందగమనం వాస్తవం: ఎస్‌బీఐ

20 Sep, 2017 00:53 IST|Sakshi
ఆర్థిక మందగమనం వాస్తవం: ఎస్‌బీఐ

► సాంకేతికం కాదని స్పష్టీకరణ 
► వృద్ధి కోసం ప్రభుత్వ వ్యయం పెరగాలని సూచన


ముంబై: దేశ ఆర్థిక వృద్ధి మందగమనం అన్నది వాస్తవమేనని, ఇదేమీ సాంకేతిక అంశం కాదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. 2016 సెప్టెంబర్‌ నుంచి ఆర్థిక రంగం కుంగుబాటులో ఉందన్న ఎస్‌బీఐ దీనికి ముగింపు పలికేందుకు ప్రభుత్వం మరింతగా వ్యయం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మందగమనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ కొనసాగిందని,  ఇది స్వల్పకాలానికి పరిమితమయ్యే సాంకేతిక అంశం కాదని ఎస్‌బీఐ పరిశోధన నివేదిక పేర్కొంది. జీడీపీ వృద్ధి వరుసగా ఆరో క్వార్టర్‌లోనూ తగ్గుముఖం పట్టి,  ఏప్రిల్‌–జూన్‌లో 5.7 శాతానికి తగ్గడం సాంకేతిక కారణాల వల్లేనని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఇటీవలే వ్యాఖ్యానించారు.

వృద్ధి రేటు యూపీఏ కాలంలో 2013–14 ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతానికి పడిపోగా, అక్కడి నుంచి 7.1 శాతానికి పెరగిందని షా గుర్తు చేశారు. అయితే, ఎస్‌బీఐ నివేదిక షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వం తన వ్యయాలను పెంచడమే సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కారమని ఎస్‌బీఐ సూచించింది. ద్రవ్యలోటు, రుణ పరిమితులకు విఘాతం కలగకుండానే ఈ పని చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే, గతంలో ఈ విధమైన చర్యలను రేటింగ్‌ ఏజెన్సీలు ఆర్థిక నైపుణ్యంగా పేర్కొంటూ దేశ రేటింగ్‌ను తగ్గిస్తామని హెచ్చరించిన విషయాన్నీ ఎస్‌బీఐ తన నివేదికలో ప్రస్తావించింది.

మరిన్ని వార్తలు