ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గింది...

1 Sep, 2016 00:03 IST|Sakshi
ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గింది...

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం
* ఆరు త్రైమాసికాల కనిష్ట స్థాయి
* మైనింగ్, నిర్మాణం, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు...
* ఆర్థిక సంవత్సరం మొత్తంలో 8 శాతం ఉంటుందని కేంద్రం భరోసా

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)  మందగమనంలోకి జారిపోయింది.  ఈ రేటు కేవలం 7.1 శాతానికి పడిపోయింది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు గడచిన ఆరు త్రైమాసికాల్లో (2014-15 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 6.6 శాతం)  ఇదే తొలిసారి. మైనింగ్, నిర్మాణం, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు దీనికి కారణం.

గత  ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధిరేటు 7.2 శాతంకాగా, చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో ఈ వృద్ధి రేటు 7.9 శాతంగా ఉంది.  కాగా గడచిన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం.
 
జీవీఏ 7.3 శాతం...
కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) బుధవారం విడుదల చేసిన బేసిక్ ధర ప్రాతిపదికన స్థూల విలువ జోడింపు (జీవీఏ) గణాంకాల ప్రకారం... మొదటి త్రైమాసికంలో వృద్ధి 7.3%గా ఉంది. మార్కెట్ ధర వద్ద జీడీపీ వృద్ధి రేటును లెక్కిం చి.. ఫ్యాక్టర్ కాస్ట్ ప్రాతిపదికన జీవీఏ లెక్కగడతారు. జీవీఏ ‘ప్లస్’ ఉత్పత్తులపై పన్నులు... ఈ విలువ నుంచి  సబ్సిడీలను మైనస్ చేస్తే వచ్చేదే జీడీపీ. జీవీఏ ప్రకారం వివిధ రంగాల ఉత్పత్తి విలువలు మొదటి త్రైమాసికంలో ఇలా ఉన్నాయి.
 
వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాలు: 1.8 శాతం వృద్ధితో మొత్తం విలువ రూ.3,74,390 కోట్లకు చేరింది.
 
మైనింగ్, క్వారీయింగ్: అసలు వృద్ధిలేకపోగా -0.4% క్షీణించి రూ.86,444 కోట్ల నుంచి రూ.86,091 కోట్లకు పడింది.
 
తయారీ: 9.1 శాతం వృద్ధితో రూ.4,90,164 కోట్లకు చేరింది.

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా: ఈ రంగంలో వృద్ధి రేటు 9.4% ఉంది. ఉత్పత్తి విలువ 62,378 కోట్లుగా నమోదయ్యింది.

నిర్మాణం: ఈ రంగంలో వృద్ధి రేటు 1.5 శాతంగా నమోదయ్యింది. ఉత్పత్తి విలువ 2,29,092 కోట్లు.

ట్రేడ్, హోటెల్స్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్: వృద్ధి  8%గా ఉంది. విలువ రూ.5,22,610 కోట్లు.
 
ఫైనాన్సింగ్, రియల్టీ, వ్యాపార సేవలు: 9.4 శాతం వృద్ధితో విలువ రూ.6,35,963 కోట్లకు ఎగసింది.
 
పబ్లిక్ అడ్మిన్, రక్షణ, ఇతర సేవలు: 12.3 శాతం వృద్ధితో రూ.3,37,630 కోట్లకు చేరాయి.
* మొత్తంగా 2015-16తో పోల్చి 2016-17లో అన్ని విభాగాల విలువ 7.3% వృద్ధితో 25,51,435 కోట్ల నుంచి 27,38,318 కోట్లకు చేరింది. అయితే జీవీఏ వృద్ధి గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 7.2% కావడం గమనార్హం.
* ఇదిలావుండగా, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌కు ప్రతిబింబమైన ప్రైవేటు వినియోగ వ్యయంలో వృద్ధి 11.7 శాతంగా నమోదయ్యింది. ఇక పెట్టుబడులకు ప్రతిబింబమైన గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఆందోళనకరమైన రీతిలో 6.8 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది.

8 శాతానికి చేరతాం: శక్తికాంత్ దాస్
ప్రస్తుత ఫలితం నిరాశాజనకంగా ఉన్నా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా వృద్ధి రేటు 8 శాతం దాపుల్లోనే ఉంటుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. తగిన వర్షపాతం, వేతన కమిషన్ సిఫారసులు 8 శాతం దిశలో వృద్ధి నడకకు దారితీసే అంశాలుగా వివరించారు. అధిక సబ్సిడీ వ్యయాలే తాజా సమీక్షా త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు పడిపోవడానికి కారణమనీ ఆయన వివరించారు. సబ్సిడీల వ్యయం జీడీపీలో దాదాపు 0.3 శాతం ఉందని పేర్కొన్న ఆయన, ఇది కలుపుకుంటే జీడీపీ 7.4 శాతానికి ఎగసేదన్న విషయం గమనార్హమన్నారు. నికర ప్రత్యక్ష పన్నులూ తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే పెట్టుబడుల పరిస్థితిపై ఆందోళన ఉందని పేర్కొన్న ఆయన, దీనికి కారణాలను సమీక్షిస్తామని వివరించారు.
 
జూలైలో మౌలిక రంగం వృద్ధి 3.2%
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జూలైలో 3.2 శాతంగా నమోదయ్యింది. 2015 జూలైలో ఈ రేటు 1.3 శాతం. రిఫైనరీ ఉత్పత్తుల భారీ వృద్ధి దీనికి కారణం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 38 శాతం వాటా కలిగిన ఎనిమిది రంగాలనూ వేర్వేరుగా చూస్తే...
 
రిఫైనరీ: వృద్ధి 2.9% నుంచి 13.7%కి ఎగసింది.
బొగ్గు: -0.1% క్షీణత నుంచి 5.1 శాతం వృద్ధికి చేరింది.
సహజ వాయువు: -4.4 శాతం క్షీణత నుంచి 3.3 శాతం వృద్ధికి మళ్లింది.
సిమెంట్: వృద్ధిలో ఎటువంటి మార్పూ లేకుండా 1.4 శాతంగా ఉంది.
ఎరువులు: వృద్ధి రేటు 8.6% నుంచి 2.5%కి పడిపోయింది.
విద్యుత్: వృద్ధి 3.5 శాతం నుంచి 1.6 శాతానికి దిగింది.
క్రూడ్ ఆయిల్: -0.4 శాతం నుంచి మరింతగా -1.8 క్షీణతలోకి పడిపోయింది.
స్టీల్:  -1.4 శాతం క్షీణత -0.5 శాతం క్షీణతకు చేరింది.
 
లక్ష్యంలో 73% దాటిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు ఆర్థిక సంవత్సరం ప్రారంభమయిన మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్-జూలై) బడ్జెట్ లక్ష్యంలో 73.3%కి పెరిగింది. విలువ రూపంలో ఈ మొత్తం రూ.3.93 లక్షల కోట్లు. 2016-17లో ద్రవ్యలోటు లక్ష్యం రూ.5.33 లక్షల కోట్లు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రేటు 3.5 శాతంగా ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. కాగా గతేడాది ఇదే కాలంలో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 69.3%గా ఉంది.

మరిన్ని వార్తలు