రూ.147 కోట్ల నీరవ్‌ మోదీ ఆస్తులు జప్తు

27 Feb, 2019 00:10 IST|Sakshi

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, ఆయన కంపెనీలకు సంబంధించి రూ.147 కోట్ల విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ముంబై, సూరత్‌లో ఈ స్థిర, చరాస్తులు (కార్లు, ప్లాంట్‌ మెషినరీ, పెయింటింగ్స్, భవనాలు) ఉన్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసి నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోవడం తెలిసిందే. నల్లధన చలామణి నియంత్రణ చట్టం(పీఎంఎల్‌ఏ) 2002 కింద ఆస్తులను జప్తు చేసింది. సీబీఐ   ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఈడీ ఈ నెల 15న నీరవ్‌మోదీ, పలువురు ఇతరులకు వ్యతిరేకంగా మనీలాండరింగ్‌ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దేశ, విదేశాల్లోని రూ.1,725 కోట్ల విలువైన ఆస్తులను గతంలోనూ జప్తు చేసిన విషయం గమనార్హం.  

>
మరిన్ని వార్తలు