కార్తీకి మరో ఎదురుదెబ్బ

13 Jun, 2018 09:08 IST|Sakshi
కార్తీ చిదంబరం (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో ఆయనపై ఈడీ తాజా చార్జిషీట్‌ను నమోదు చేసేందుకు సంసిద్ధమైంది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఎదుట తాజా అభియోగపత్రాన్ని ఈడీ నమోదు చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ డీల్‌లో కార్తీ చిదంబరం సహా ఇతరుల పాత్రను ఈ చార్జిషీట్‌లో ఈడీ ప్రముఖంగా ప్రస్తావిస్తుందని సమాచారం. మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టం కింద ఈ కేసులో ఈడీ ఇప్పటికే కార్తీ చిదంబరాన్ని రెండు సార్లు ప్రశ్నించడంతో పాటు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

మరోవైపు ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ)2006లో గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై కార్తీని ఈడీ ప్రశ్నించింది. ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించిన కొద్దిరోజులకే కార్తీకి చెందిన సంస్థగా భావిస్తున్న ఏఎస్‌సీపీఎల్‌కు ఎయిర్‌సెల్‌ టెలివెంచర్స్‌ లిమిటెడ్‌ రూ 26 లక్షలు చెల్లించడంపై ఈడీ సందేహాలు వ్యక్తం చేస్తోంది.

కార్తీపై తాజా చార్జిషీట్‌ ఎప్పుడో దాఖలు కావాల్సి ఉందని, చిదంబరానికి సన్నిహితులైన అధికారులు ఆయనకు సాయపడేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఈడీ, సీబీఐలపై ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు