ఫార్మాపై యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రభావం

19 Nov, 2019 03:46 IST|Sakshi
హెల్త్, ఫార్మా రిపోర్ట్‌ను విడుదల చేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌. చిత్రంలో జి.వి.ప్రసాద్‌ తదితరులు

తనిఖీల వల్లే ప్రస్తుత పరిస్థితి 

డాక్టర్‌ రెడ్డీస్‌ కో–చైర్మన్‌ ప్రసాద్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ ఫార్మా కంపెనీల ప్లాంట్లలో యూఎస్‌ఎఫ్‌డీఏ తరచూ తనిఖీలు చేయడం, లోపాలను లేవనెత్తడంతో ఔషధ ఎగుమతుల వృద్ధి తగ్గుతోందని సీఐఐ ఫార్మాస్యూటికల్స్‌ నేషనల్‌ కమిటీ చైర్మన్, డాక్టర్‌ రెడ్డీస్‌ కో–చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ అన్నారు. సీఐఐ–ఐఎంటీహెచ్‌ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన హెల్త్, ఫార్మా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వార్నింగ్ లెటర్ల కారణంగా చాలా కంపెనీల అనుమతులు నిలిచిపోయాయి. దీంతో కొత్త ఉత్పత్తుల విడుదల ఆగిపోయింది. వీటి నుంచి బయటపడాలంటే యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రమాణాలకు తగ్గట్టుగా ఇక్కడి కంపెనీలు నాణ్యత, వ్యవస్థ, క్రమశిక్షణ, సమాచార సమగ్రత పాటించాల్సిందే. ఇంకా పాత ప్లాంట్లను కొనసాగిస్తున్న కంపెనీలూ ఉన్నాయి. యాంత్రికీకరణ జరగాలి’ అని వివరించారు.  

కొత్త అవకాశాలు ఉన్నా.. 
యూఎస్‌–చైనా ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో భారత ఔషధ కంపెనీలకు పెద్ద ఎత్తున అవకాశాలను తెచ్చిపెడుతోందని ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్, కెమికల్‌ ఇంటర్మీడియరీస్‌ సరఫరాలో అంతర్జాతీయంగా చైనా అగ్రస్థానంలో ఉందన్నారు. వీటిని భారత్‌తోపాటు ప్రపంచదేశాలు చైనా నుంచే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అతి తక్కువ ధరకు ముడి సరుకును చైనా సరఫరా చేస్తోందన్నారు. ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో పశి్చమ దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావిస్తున్నాయని గుర్తుచేశారు. ‘ఇప్పుడు చైనా నూతన ఆవిష్కరణలవైపు దృష్టిసారిస్తోంది. చవక ముడిపదార్థాల సరఫరాదారు అన్న ముద్ర నుంచి బయటపడాలని చూస్తోంది. ఈ అంశమే భారత్‌కు నూతన వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. చైనా ఒక్కటే భారత్‌కు అతి పెద్ద మార్కెట్‌. భారత కంపెనీలు ముడిపదార్థాల తయారీ పెంచాలి. ఇందుకు తగ్గట్టుగా పెట్టుబడి చేయాలి’ అని వెల్లడించారు.

డిజిటల్‌ మార్కెటింగ్‌.. 
ఫార్మా కంపెనీలు డిజిటల్‌ మార్కెటింగ్‌ విషయంలో ఇంకా వెనుకంజలో ఉన్నాయని ప్రసాద్‌ తెలిపారు. పాత పద్ధతిలోనే మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌తో ఔషధాలను మార్కెట్‌ చేస్తున్నాయని అన్నారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ పెరిగితే మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ ఉద్యోగాలు తగ్గినా... కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయ న్నారు. కాగా, ఐఎంటీ రూపొందించిన హెల్త్, ఫార్మా రిపోర్ట్‌ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విడుదల చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ వైస్‌ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు