ఎలక్ట్రిక్‌ వాహనం కొంటే...  పార్కింగ్‌ ఉచితం!

10 Jan, 2019 00:47 IST|Sakshi

రోడ్‌ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా తక్కువే

ప్రభుత్వానికి ప్యానెల్‌ సిఫారసులు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ముందుకొచ్చే వారికి ఎన్నో ప్రోత్సాహకాలు, రాయితీలు లభించనున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం నియమించిన కేబినెట్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ సిన్హా ఆధ్వర్యంలోని ప్యానెల్‌ పలు కీలక సిఫారసులు చేసింది. తయారీదారులు కూడా పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలన్నది ప్రతిపాదన. ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తక్కువ ఉండేలా చూడాలని, అలాగే, జీఎస్టీ రేటు కూడా తక్కువ ఉండాలని సిఫారసు చేసింది. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని భారీగా పెంచొచ్చని పేర్కొంది. ఇక కొనుగోలు దారులను ఆకర్షించేందుకు... తక్కువ రిజిస్ట్రేషన్‌ చార్జీలు, రోడ్‌ ట్యాక్స్‌ తక్కువగా విధించడం వంటి సిఫారసుల్లో ఉన్నాయి.

ప్రధాన మంత్రి అధ్యక్షతన గల అత్యున్నత స్థాయి కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుందని, అనంతరం రెవెన్యూ, భారీ పరిశ్రమలు, ఉపరితల రవాణా శాఖలు తదుపరి చర్యల కోసం ఆదేశాలు జారీ చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రెండు డజన్లకు పైగా అధికారులు కలసి ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన ఈ విధానానికి తుదిరూపం ఇచ్చినట్టు చెప్పాయి. గత నెలలో ఈ ప్యానెల్‌ సమావేశం జరిగిందని, ఈ మెగా ప్రణాళికను తీసుకొచ్చే విషయంలో నీతి ఆయోగ్‌ మోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నట్టు తెలిపాయి. అంతర్జాతీయంగా రవాణా విషయంలో భారత్‌ను కీలక స్థానంలో నిలబెట్టాలంటే అందుకు అవసరమైన విధానాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని... దేశంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాలు, అన్ని విడిభాగాలు ఇక్కడే తయారు చేయడం ద్వారానే ఇది సాధ్యమన్నది ప్రభుత్వం యోచనగా ఆ వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలకు స్థిరమైన విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్‌లోనే ప్రకటించారు. బ్యాటరీల నుంచి స్మార్ట్‌ చార్జింగ్, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వరకు పెట్టుబడులను పెంచాలనుకుంటున్నట్టు చెప్పారు. 

>
మరిన్ని వార్తలు