ట్యాక్సీ సేవల్లోకి ఇ–యానా

11 Dec, 2019 01:35 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న వీజీ అర్సెడో ఎనర్జీ.. ట్యాక్సీ సేవల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇ–యానా పేరుతో తొలుత కరీంనగర్, వరంగల్‌లో ప్రవేశిస్తోంది. ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్లు, టూ వీలర్లతో సేవలందించడం దీని ప్రత్యేకత. ఇ–యానా యాప్‌ను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్, కైనెటిక్‌ గ్రీన్‌ ఫౌండర్‌ సులజ్జ ఫిరోదియా మోత్వానీ మంగళవారమిక్కడ ఆవిష్కరించారు.

ప్రస్తుతం రెండు నగరాలకు కలిపి 50 ఆటోలు, 50 స్కూటర్లను కొనుగోలు చేశామని కంపెనీ డైరెక్టర్‌ సందీప్‌ వంగపల్లి తెలిపారు. డైరెక్టర్లు విజయ్‌ కుమార్, నవనీత్‌ రావు, శశికాంత్‌ రెడ్డితో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘2020 మార్చినాటికి మరో 200 స్కూటర్లు, 200 ఆటోలు కొంటాం. ఆరు నెలల్లో రూ.50 కోట్ల నిధులు సమకూర్చుకుంటాం. ఇప్పటికే రూ.4.5 కోట్లు ఖర్చు చేశాం. దశలవారీగా ఖమ్మం, నిజామాబాద్, చెన్నై, భువనేశ్వర్‌లో అడుగు పెడతాం. కిలోమీటరుకు చార్జీ త్రీ వీలర్‌ అయితే రూ.10, టూ వీలర్‌కు రూ.6 ఉంటుంది’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు