15 నుంచి రాష్ట్రాల పరిధిలో ఈవే బిల్లు

11 Apr, 2018 00:42 IST|Sakshi

ఏపీ, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అమలు

న్యూఢిల్లీ: ఒక రాష్ట్రం పరిధిలో (ఇంట్రా స్టేట్‌) వస్తు రవాణాకు వీలుగా ఈవే బిల్లు విధానాన్ని ఈ నెల 15 నుంచి ఐదు రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, యూపీ, గుజరాత్‌లో తొలి దశలో ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

ఏప్రిల్‌ 1 నుంచి ఎలక్ట్రానిక్‌ వే బిల్లింగ్‌ విధానాన్ని పలు రాష్ట్రాల మధ్య వస్తు రవాణా ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి దశలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఈవే బిల్లు అమలుతో తదుపరి దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ రాష్ట్రాల్లోని వర్తకులు, ట్రేడర్లు, రవాణా సంస్థలు ఈవే బిల్లు పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 1 నుంచి ఇంట్రాస్టేట్‌ ఈవే బిల్లు విధానాన్ని కర్ణాటక రాష్ట్రం ఒక్కటే ప్రారంభించింది.  

మరిన్ని వార్తలు