వడ్డీ రేట్లు ఇంకా తగ్గించండి

13 Jun, 2015 01:18 IST|Sakshi
వడ్డీ రేట్లు ఇంకా తగ్గించండి

- బ్యాంకర్లతో భేటీలో ఆర్థిక మంత్రి జైట్లీ సూచన
- సానుకూలంగా స్పందించిన బ్యాంకులు
న్యూఢిల్లీ:
రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించిన దానికి అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. జనవరి నుంచి ఇప్పటిదాకా ఆర్‌బీఐ ముప్పావు శాతం మేర పాలసీ రేట్లు తగ్గించినప్పటికీ ఇంకా ఖాతాదారులకు ఆ మేర ప్రయోజనాలను ఎందుకు బదలాయించడం జరగలేదని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా తక్కువ వడ్డీకి పెట్టుబడి లభించేలా చూసే దిశగా జైట్లీ శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సీఈవోలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వడ్డీ రేట్లను తగ్గించే అంశాన్ని బ్యాంకులు నానుస్తూ ఉండటంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. ఆర్‌బీఐ రేట్ల కోతకు తగ్గట్లుగా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ జైట్లీ సూచించారు. బ్యాంకర్లు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. రాబోయే 2-3 నెలల్లో మరింతగా వడ్డీ రేట్ల తగ్గుదలను చూడొచ్చని వారు ఏకగ్రీవంగా హామీ ఇచ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం ముగిసిన వెంటనే జైట్లీ అసాధారణంగా.. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ తదితర దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల చీఫ్‌లతో కూడా సమావేశమయ్యారు.

కొన్ని బ్యాంకులు ఇప్పటికే రేట్ల కోతను కొంత బదలాయించగా, మరికొన్ని ఆ దిశగా ఇంకా చ ర్యలు తీసుకోలేదని సమావేశాల అనంతరం జైట్లీ విలేకరులతో చెప్పారు. ఓవైపు మొండి బకాయిల భారం, మరోవైపు చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేటు ఇవ్వాల్సి వస్తుండటం తదితర అంశాలు ఇందుకు కారణమని బ్యాంకర్లు తెలిపినట్లు ఆయన వివరించారు. అయితే పరిస్థితులు ఆశావహంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బ్యాంకర్లు మరింత ఎక్కువగా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండొచ్చని జైట్లీ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ జనవరి నుంచి ఇప్పటిదాకా మూడు విడతల్లో రెపో రేటును (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) మొత్తం ముప్పావు శాతం తగ్గించింది. ఆర్‌బీఐ చివరిసారిగా జూన్ 2న పాలసీ రేటును పావు శాతం తగ్గించిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి.  

పీఎస్‌బీలకు మరింత మూలధనం..: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింతగా మూలధనం సమకూరుస్తామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో కేటాయింపుల కన్నా ఎక్కువగా మూలధనం కావాలంటూ బ్యాంకులు కోరడం సబబేనన్నారు. ఈ ఏడాది బ్యాంకులకు అదనపు మూలధనం సమకూర్చేందుకు కేంద్రం బడ్జెట్‌లో రూ. 7,940 కోట్లు కేటాయించింది. తగిన సమయంలో మార్కెట్ ద్వారా నిధులు సమీకరించుకునే అంశంపై బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఉందని జైట్లీ పేర్కొన్నారు.
 
చిన్న సంస్థలకు రుణాలు రెట్టింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చిన్న తరహా సంస్థలకు రుణాలు రెట్టింపై.. రూ. 1 లక్ష కోట్ల స్థాయికి చేరొచ్చని జైట్లీ చెప్పారు. వాటి అవసరాలకు అనుగుణంగా ఉండే పథకాలను రూపొందించాల్సి ఉంటుందని బ్యాంకర్లకు ఆయన సూచించారు. ఇక ఇటీవలి సామాజిక భద్రత పథకాలతో పాటు పలు ప్రభుత్వ పథకాల విషయంలో ప్రైవేట్ బ్యాంకులు చొరవగా పాల్గొనడం లేదని జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ ప్రాధాన్య అంశాల్లో పాలుపంచుకోవడం వల్ల ప్రైవేట్ బ్యాంకులకూ ప్రయోజనాలు ఉంటాయన్నారు.

మరిన్ని వార్తలు