ఒత్తిడిలో ఉద్యోగులు.. 

20 Feb, 2019 02:16 IST|Sakshi

జీవన శైలితో సమస్యలు 

విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదిక 

న్యూఢిల్లీ: ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు ఉద్యోగులకు జీవన శైలిపరమైన రిస్కులుగా ఉంటున్నాయి. వీటితో పాటు స్థూలకాయం, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, పొగాకు వినియోగం సైతం ఉద్యోగులను కుంగదీస్తున్నాయి. దేశీయంగా ఉద్యోగుల స్థితిగతులపై కన్సల్టెన్సీ సంస్థ విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న కంపెనీలు ఈ అంశాలు వెల్లడించాయి. ఉద్యోగుల్లో ఒత్తిడిని అధిగమించడంపై ప్రస్తుతం దేశీ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని నివేదిక పేర్కొంది. ‘ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, మానసిక పరిస్థితులు మెరుగుపర్చేందుకు గతేడాది దాదాపు 80 శాతం సంస్థలు కనీసం ఏదో ఒక్క ప్రయత్నం చేశాయి.

మరికొన్ని సంస్థలు ఉద్యోగుల్లో ఒత్తిడి, ఆరోగ్యపరమైన సమస్యలను గుర్తించి, పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాయి‘ అని వివరించింది. శారీరక శ్రమ లేకపోవడం (62 శాతం), ఒత్తిడి (55 శాతం) ఉద్యోగులకు ప్రధానమైన లైఫ్‌స్టయిల్‌ రిస్కులుగా ఉంటున్నాయని కంపెనీలు గుర్తించాయని విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ వివరించింది. గతేడాది జూన్‌–ఆగస్టు మధ్యకాలంలో నిర్వహించిన ఈ సర్వేలో 100 పైచిలుకు సంస్థల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు