ఉద్యోగుల్లో అసంతృప్తి

2 Mar, 2015 03:52 IST|Sakshi
ఉద్యోగుల్లో అసంతృప్తి

* బేసిక్ లిమిట్ జోలికెళ్లని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
* రెండు కోట్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు నిరాశ
* ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపులు మాత్రం పెంపు.. సెక్షన్ 80 సీసీడీపై
* అదనంగా రూ. 50 వేల మినహాయింపు
* రవాణా భత్యం పెంపుతో స్వల్ప ఊరట
* ఏడాదికి రూ. కోటి దాటిన వారిపై మరో 2 శా
తం సర్‌చార్జి
 
సాక్షి, బిజినెస్ విభాగం:
ఈసారి బడ్జెట్లో కేంద్రం తమను విస్మరించటంపై మధ్య  తరగతి ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలిచాక నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్లో వేతన జీవులకు ఊరటనిచ్చేలా బేసిక్ లిమిట్ పెంచటం వంటి పన్ను మినహాయింపు ప్రతిపాదనలుంటాయని ఆశించినా అలాంటివేమీ లేవు. అయితే సెక్షన్ 80 సీసీడీ కింద అదనపు మినహాయింపులిచ్చినా... 18 ఏళ్ల కిందట నిర్ణయించిన రవాణా భత్యాన్ని రెట్టింపు చేసినా... 2.1 కోట్ల మందికిపైగా ఉన్న పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగ వర్గాల్లో పెద్దగా హర్షాతిరేకాలేవీ లేవు. నెలకు 800 రూపాయలుగా ఉన్న ఈ పన్ను రహిత రవాణా భత్యాన్ని 1,600కు పెంచటం తెలిసిందే.
 
 తాజాగా ఆర్థిక మంత్రి ప్రకటించిన మార్పులివీ...
 *    నెలకు రూ.9 లక్షలు ఆదాయం (ఏడాదికి కోటి) దాటిన వారిపై మరో రెండు శాతం సర్‌చార్జి విధించారు. దీంతో వీరు నెలకు రూ.5,800 వరకూ అదనంగా చెల్లించాలి.
 *    ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంపై మినహాయింపును రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచారు.
 *    60 ఏళ్లు దాటిన వృద్ధుల విషయంలో దీన్ని ప్రస్తుత రూ.20,000 నుంచి రూ.30,000కు పెంచారు.
 *    80 ఏళ్లు దాటిన వృద్ధులు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే వారికి వివిధ చికిత్సలకయ్యే వ్యయంలో రూ.30,000 వరకు పన్ను మినహాయింపు ఇస్తారు.
 *    80 ఏళ్లు దాటిన వారు కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్స వ్యయంపై మినహాయింపును ప్రస్తుత 60,000 నుంచి రూ.80,000కు పెంచారు.
 *    వికలాంగులకు ప్రస్తుతమనున్న మినహాయింపు పరిమితిని మరో రూ.25,000 పెంచారు.
 *    కొత్త పింఛను పథకంలో ఇన్వెస్ట్ చేస్తే ఇచ్చే మిన హాయింపు మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు.
 *    కొత్త పింఛను పథకంలో గనక ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సీసీడీ కింద అదనంగా రూ.50,000 మినహాయింపు ఇస్తారు.  
 ప్రస్తుతం వార్షిక జీతం నుంచి నేరుగా మినహాయించే బేసిక్ లిమిట్ రూ.2.5 లక్షలు. అంటే ఆ లోపు జీతం ఉన్నవారు అసలు పన్ను పరిధిలోకే రారన్న మాట.
 
ఈ బేసిక్ లిమిట్ ఎప్పుడెప్పుడు ఎలా పెరిగిందంటే...

 2010-11 వరకూ    2011-12లో    2012-13లో    2014-15లో
 రూ.1.5 లక్షలు    రూ.1.75 లక్షలు    రూ.2 లక్షలు    రూ.2.5 లక్షలు
 
 60 ఏళ్లు దాటిన సీనియర్  సిటిజన్స్ విషయంలో...

 2010-11 వరకూ    2011-12లో    2012-13లో    2014-15లో
 రూ.2.4 లక్షలు    రూ.2.5 లక్షలు    -    రూ.3 లక్షలు
 
 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ పెంపువల్ల ఏడాదికి ఎవరికెంత లాభం?

 10% శ్లాబ్ వారికి    20% శ్లాబ్‌కు    30% శ్లాబ్‌కు
 రూ.989    రూ.1,979    రూ.2,966

మరిన్ని వార్తలు