మాయా ప్రపంచం

24 Aug, 2019 09:18 IST|Sakshi

కళ్ల ముందు కోరినవన్నీ సాక్షాత్కారం

ఆదరణ పొందుతున్న వర్చువల్‌ రియాలిటీ   

యువతకు బోలెడు అవకాశాలు

శ్రీనగర్‌కాలనీ: చిత్రం...భళారే విచిత్రం..పాట ఎంతో ఫేమస్‌.. భవిష్యత్‌లో ఆ చిత్రమే భలే విచిత్రంగా కాల్పనిక వాస్తవికతతో అబ్బురుపరుస్తుంది. చిత్రమే చలనం, చలనమే చిత్రం..అన్న తీరులో వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌ ) టెక్నాలజీ మాయా ప్రపంచంలోకి తీసుకెళుతుంది. రానున్న కాలంలో వర్చువల్‌ రియాలిటీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలు వీడియో గేమ్స్‌ ఆడుతూ కాలాన్ని వృథా చేస్తున్నారని బాధపడాల్సిన అవసరం లేదు.  వారికి సృజనాత్మకత ఉంటే వారే రేపటి వర్చువల్‌ రియాలిటీకి దిక్సూచిలా ఉంటారు.వర్చువల్‌ రియాలిటీకి భవిష్యత్‌లో ఊహకందని డిమాండ్‌ ఉంటుంది. ఇప్పుడు కేవలం వర్చువల్‌ రియాలిటీ వీడియోగేమ్స్‌కు మాత్రమే పరిమితమై ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తుంది. ఎడ్యుకేషన్, హెల్త్, బిజినెస్, రియల్‌ ఎస్టేట్‌ లాంటి వాటికే కాకుండా ల్యాబ్స్‌ అవసరం లేకుండా వర్చువల్‌ ల్యాబ్స్‌తో ప్రయోగాలు చేసేలా వర్చువల్‌ రియాలిటీ కనులను మాయ చేస్తుంది. అంతేకాదండోయ్‌.. వర్చువల్‌ రియాలిటీని చేసే సాప్ట్‌వేర్స్‌ అయిన అన్‌రీల్‌ ఇంజన్, యూనిటీ లాంటి సాప్ట్‌వేర్స్‌ని హైదరాబాద్‌ నగరంలోని అతికొద్ది సంస్థలు విద్యార్థుల కొరకు అందుబాటులోకి తెచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.

వీఆర్‌ పనితీరు
వర్చువల్‌ రియాలిటీ అంటే కాల్పనిక వాస్తవికత. సాంకేతిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ సహాయంతో వాస్తవంలా అనిపించే 3–డైమెన్షనల్‌ మిథ్యా వాతావరణాన్ని నిర్మించి   ప్రేక్షకుడు, వినియోగదారుడు అనుభూతిని నిజంగా పొందేలా చేసే ప్రక్రియే వర్చువల్‌ రియాలిటీ. క్లుప్తంగా, సూక్ష్మంగా చెప్పాలంటే మనకు కలలు వచ్చినపుడు ఎలా ఫీలవుతామో అలాంటి స్థితి అని చెప్పవచ్చు. కల్పితంగా, కృత్రిమంగా సృష్టించిన పరిస్థితులు, పరిసరాలు అనుభూతులతో మనిషి మెదడును కదిలించేలా సహజత్వంతో ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. కల్పితం అనే మాట నుంచి కళ్ళకు నిజం చేసే స్థాయికి వర్చువల్‌రియాలిటీ చేరింది. బ్రహ్మంగారు చెప్పినట్లు కలలు నిజమవుతాయి...జరగనివి జరుగుతాయి..అన్నట్లు వర్చువల్‌ రియాలిటీ నేడు అన్ని రంగాల్లో భవిష్యత్‌కు మార్గదర్శిగా మారింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దీని మీద రెడి ప్లేయర్‌ వన్‌ అనే చిత్రాన్ని నిర్మించి విజయాన్ని నమోదు చేశారు. కొన్ని అనుమానాలున్నా వాటిని పటాపంచలు చేస్తూ కొత్త భవిష్యత్‌కు మార్గాన్ని సుగమం చేసింది. దీనికి కావాల్సిందల్లా కంప్యూటర్‌   లేదా స్మార్ట్‌ఫోన్‌తో పాటు వీఆర్‌ హెడ్‌సెట్‌ ఉంటే చాలు..మనల్ని ఊహా ప్రపంచంలోకి తీసుకెళుతుంది. 

హెల్త్, ఎడ్యుకేషన్, బిజినెస్‌లలో ప్రముఖంగా...
కాల్పనిక వాస్తవికతను ఇప్పుడిప్పుడే హెల్త్, ఎడ్యుకేషన్, బిజినెస్‌లలో ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యంలో వర్చువల్‌ రియాలిటీ చాలా ఉపయుక్తంగా ఉంటుందనటంటే ఎలువంటి అనుమానాలు లేవు. పిల్లల భయాలను పోగొడుతూ వర్చువల్‌ రియాలిటీ ద్వారా వారి చికిత్సను అందించడానికి దోహదపడుతుంది.ఆఖరి దశలో ఉన్న రోగికి లేదా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆఖరి కోరికలను వారికి ఇష్టమైన ప్రదేశాలను చూసి ఆనందించేలా చేయడంలో వీఆర్‌ కీలకంగా మారనుంది. శరీర భాగాల నిర్మాణాలను తయారీలో వినియోగించే 3డీ, 4డీలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తూ సరికొత్తగా వైద్య విద్యార్థులు విద్యను నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది.   

మంచి ఉపాధి అవకాశం
భవిష్యత్‌లో వీఆర్‌కు మంచి భవిష్యత్‌ ఉంది. అన్ని రంగాల్లో వీఆర్‌ తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ టెక్నాలజీలో ఉపయోగించే అన్‌రీల్, యూనిటీ సాఫ్ట్‌వేర్స్‌ను టెన్త్‌ పాసైన విద్యార్థులు సైతం నేర్చుకోవచ్చు. కొద్దిగా నేర్పు, సృజతాత్మకత ఉంటే చాలు. మా సంస్థలో మేము గేమింగ్స్‌తో పాటు పలు విషయాలపై వీఆర్‌ ద్వారా ఎక్సపరిమెంట్స్‌ చేస్తున్నాం. ఈ సాప్ట్‌వేర్స్‌ను నేర్పించి మేమే ఉపాధిని కల్పిస్తున్నాం.– వంశీ చౌదరి, సీఈఓ, ఇన్ఫినిటో గేమింగ్‌ స్టూడియో

సృజనాత్మకత ఉంటే చాలు  
వర్చువల్‌ రియాలిటీ కలల్ని నిజం చేస్తుంది. మనల్ని ఊహాలోకంలోకి తీసుకెళుతుంది. హెల్త్, ఎడ్యుకేషన్, బిజినెస్‌ రంగాల్లో వీఆర్‌ ప్రాముఖ్యత రెట్టింపు అయింది. వీఆర్‌ సాప్ట్‌వేర్స్‌ చాలా సులభం. తక్కువ సమయంలో ఈ సా‹ఫ్ట్‌వేర్స్‌ అభ్యసించి మంచి వేతనాలను పొందవచ్చు. సృజనాత్మకత ఉన్న విద్యార్థులకు వీఆర్‌ మంచి అవకాశం. అపోహలను తొలగిస్తూ వీఆర్‌ నేడు మార్కెట్‌లో దూసుకుపోతోంది.  – రఘు, గేమింగ్‌ ట్రైనర్‌ 

మరిన్ని వార్తలు