డిజిటల్‌ నైపుణ్యాలుంటే ప్రోత్సాహకాలు

16 Apr, 2019 00:29 IST|Sakshi

ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ ప్రత్యేక స్కీమ్‌

న్యూఢిల్లీ: అమెరికా అవకాశాలు తగ్గి, అట్రిషన్‌ రేటు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉద్యోగుల వలసలను తగ్గించేందుకు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్‌ విభాగంలో నైపుణ్యాలున్న ఉద్యోగులకు ప్రోత్సాహకాలిచ్చేలా ప్రత్యేక పథకాల్లాంటివి కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. గతేడాది ఆర్థిక ఫలి తాల సందర్భంగా ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో సంస్థ సీవోవో ప్రవీణ్‌ రావు ఈ విషయాలు వెల్లడించారు. మార్చి త్రైమాసికంలో ఉద్యోగుల వలస 17.8 శాతం నుంచి 18.3 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

3–5 ఏళ్ల అనుభవం ఉన్న వారు, ప్రధానంగా అమెరికాలో ఆన్‌సైట్‌ అవకాశాల కోసమే ఆగిన వారు ఇందులో ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కఠినతర వీసా నిబంధనల కారణంగా అమెరికా అవకాశాలు తగ్గిపోవడంతో వారు ఇతర సంస్థల వైపు మళ్లారని ప్రవీణ్‌ రావు చెప్పారు. మరోవైపు, అమెరికాలో ఎక్కువగా స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని, దీనివల్ల వీసాలపరమైన సమస్యలు కొంత అధిగ మించగలుగుతున్నామని ఆయన వివరించారు.   

మరిన్ని వార్తలు