బ్రాండ్ అంబాసిడర్లు జర జాగ్రత్త!

13 Apr, 2016 12:11 IST|Sakshi
బ్రాండ్ అంబాసిడర్లు జర జాగ్రత్త!

న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌ వివాదానంతరం ఉత్పత్తుల ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిర్వర్తించే ప్రముఖ ఎండాసర్లకు మరింత బాధ్యత పెరిగింది. తప్పుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధించాలని ప్రతిపాదిస్తూ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. త్వరలోనే పార్లమెంట్కు ఈ నివేదికను అందించనుంది.

ప్రైవేట్‌ కంపెనీలకు, ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా కాంట్రాక్టుపై సంతకం చేసేముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంది. వినియోగదారుల రక్షణ బిల్లు కింద ఈ ప్రతిపాదనలను పార్లమెంటరీ కమిటీ సిద్ధంచేసింది. ఎప్పడినుంచైతే తప్పుడు ఉత్పత్తులకు ప్రచారం నిర్వర్తిస్తున్నారో, అప్పటినుంచి ఉత్తత్పిదారుడితో పాటు వారికి బాధ్యత ఉంటుందని, జరిమానా కచ్చితంగా చెల్లించాల్సిదేనని కమిటీ తెలిపింది.

ఉత్పత్తుల అమ్మకాల బట్టి కూడా తప్పుడు ప్రకటనలకు జరిమానా విధిస్తామని పార్లమెంటరీ కమిటీ హెడ్, టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తెలిపారు. చాలామంది సెలబ్రిటీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉంటున్నారని చెప్పారు. తప్పుడు ప్రకటనలకు ఎండాసర్లుగా ఉన్నట్టు మొదటిసారి తేలితే రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని, అదే రెండో సారి కూడా తప్పుడు ప్రకటనలు చేస్తే రూ. 50 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా కమిటీ ప్రతిపాదించింది. ఉత్పత్తుల అమ్మకాల బట్టి కూడా జరిమానా పెంచేవిధంగా ప్రతిపాదనలు సిద్ధంచేశారు.

జాతీయ అవార్డు గ్రహీతలకు, సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్‌ బట్టి, వారు తప్పుడు ప్రకటనలు చేస్తున్నా వినియోగదారులు గుడ్డిగా నమ్మేస్తున్నారని కమిటీ పేర్కొంది. కల్తి ఆహార పదార్థాలను మంచివిగా తప్పుడు ప్రకటనలు చేస్తే మాత్రం కఠినమైన తప్పవని కమిటీ హెచ్చరించింది. ఆ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల లైసెన్సులు సస్పెన్షన్‌ ఉంటాయని కమిటీ ప్రతిపాదించింది.        

మరిన్ని వార్తలు