ఆదిభట్లలో ఇంజిన్‌ పరికరాల తయారీ!

15 Dec, 2017 02:04 IST|Sakshi

టాటా– జీఈ ఏవియేషన్‌ అవగాహన ఒప్పందం

వీటిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే అవకాశం

పెట్టుబడి విలువ రూ.3,200 కోట్లపైనేనని అంచనా!!

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటికే ఏరోస్పేస్‌ రంగంలో టాటాల రాకతో తనదైన ముద్ర వేసుకున్న హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ పెట్టుబడి రాబోతోంది. ఆదిభట్లలోని ఏరోస్పేస్‌ సెజ్‌లో వైమానిక ఇంజిన్లు తయారు చేయడానికి టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ ఏరో సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌), అంతర్జాతీయ ఇంజినీరింగ్‌ దిగ్గజం జీఈ గ్రూప్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఇవి ఇక్కడ సీఎఫ్‌ఎం లీప్‌ వైమానిక ఇంజిన్‌కు అవసరమయ్యే వివిధ పరికరాలను తయారీ చేస్తాయి.

తాజా ఒప్పందం ప్రకారం జీఈ ఏవియేషన్స్, టీఏఎస్‌ఎల్‌ కలిసి ఎయిర్‌క్రాఫ్ట్‌ కాంపొనెంట్‌ తయారీ, అసెంబ్లింగ్, టెస్టింగ్‌ వంటి రంగాల్లో కలిసి పనిచేస్తాయి. దీంతోపాటు కొత్తగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేసి ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్ల తయారీకి అవసరమైన ఇతర సంస్థల ఏర్పాటుకూ ప్రయత్నాలు చేస్తారు. గురువారమిక్కడ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జీఈ– టాటా సన్స్‌ ఈ వివరాలు వెల్లడించాయి. మొత్తంగా ఇంజిన్ల తయారీకి అవసరమయ్యే పూర్తిస్థాయి ఎకో–సిస్టమ్‌ను ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ చెప్పారు. దీనికోసం ఎంత పెట్టుబడి పెడుతున్నదీ వెల్లడించనప్పటికీ... దాదాపు 50 కోట్ల డాలర్లుగా ఉండొచ్చని విశ్వసీనయంగా తెలియవచ్చింది.

మేకిన్‌ ఇండియా వ్యూహానికి తోడ్పాటు!!
తదుపరి తరం సింగిల్‌ ఐల్‌ కమర్షియల్‌ జెట్లను సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌ తయారు చేస్తోంది. వీటికి ఈ లీప్‌ ఇంజిన్లు అమరుస్తారు. సీఎఫ్‌ఎం అనేది జీవీ ఏవియేషన్‌ – ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ కలిసి 50–50 భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్న సంస్థ. ఈ ఇంజిన్‌ కోసం హైదరాబాద్‌లో తయారు చేసే పరికరాలను జీఈ ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తుంది.

అంతేకాకుండా దేశీయంగా మిలటరీ ఇంజిన్, విమానాల విడిభాగాల తయారీ అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని టాటా– జీఈ యోచిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా టాటా గ్రూప్‌తో కలసి పనిచేయడం... భారత ప్రభుత్వ మేకిన్‌ ఇండియా వ్యూహానికి తోడ్పాటునిచ్చేదేనని జీఈ చైర్మన్‌ సీఈఓ జాన్‌ ఎల్‌ ఫ్లానెరీ వ్యాఖ్యానించారు. జీఈ సహకారంతో రక్షణ దళాలకు అవసరమయ్యే వినూత్న ఉత్పత్తులను అందించగలమని చంద్రశేఖరన్‌ చెప్పారు.

మంత్రి కేటీఆర్‌ హర్షం: తెలంగాణ ఏరోస్పేస్‌ రంగానికి తాజా ఒప్పందం మరింత ఊతమిస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చెప్పారు. గత ఏడాది అమెరికాలో జీఈ ప్రతినిధులను కలుసుకున్న కేటీఆర్‌... బుధవారం కూడా ఢిల్లీలో జీఈ ఛైర్మన్‌ ఫ్లానెరీతో సమావేశమయ్యారు. తాజా పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. టాటా గ్రూపు, ఛైర్మన్‌ చంద్రశేఖరన్, రతన్‌ టాటాకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు