టెక్నాలజీతోనే బీమా పరిశ్రమ వృద్ధి

1 Jan, 2019 02:53 IST|Sakshi

రానున్న సంవత్సరాల్లోనూ  పెరుగుదల వేగవంతం

పరిశ్రమ నిపుణుల అంచనా

న్యూఢిల్లీ: బీమా పరిశ్రమ వృద్ధికి టెక్నాలజీ అండగా నిలుస్తోంది. కొత్త కస్టమర్లను చేరుకునేందుకు టెక్నాలజీని అవి వినియోగించుకుంటున్నాయి. పూర్తి స్థాయి సంస్కరణలు, సులువుగా అర్థం చేసుకునే ఉత్పత్తులను ప్రవేశపెట్టినప్పటికీ... ఇప్పటికీ తక్కువ బీమా రక్షణే ఉన్న దేశంలో మరింత మంది కస్టమర్లను సొంతం చేసుకునేందుకు కంపెనీలకు టెక్నాలజీ ఉపయోపడుతోంది. హెచ్‌ఐవీ, మానసిక అనారోగ్యాలనూ బీమా పరిధిలోకి  చేర్చడం, దీర్ఘకాలిక థర్డ్‌ పార్టీ మోటారు ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేయడం గతేడాది సంస్కరణల్లో భాగంగా ఉన్నాయి. అంతేకాదు, పేదల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓ ఆరోగ్యబీమా పథకాన్ని కూడా తీసుకొచ్చింది.

2018లో కూడా ఆన్‌లైన్‌ విక్రయాల్లో బలమైన వృద్ధి నమోదైనట్టు కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో అనుజ్‌మాథుర్‌ తెలిపారు. పెద్ద ఎత్తున డిజిటైజేషన్, వినియోగదారు అనుకూల ఉత్పత్తులను తీసుకురావడం ఈ వృద్ధికి దోహదపడినట్టు చెప్పారు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ ఉత్పత్తులు, ఇతర చానళ్లను వినియోగించుకోవడం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జీవిత బీమా ఉత్పత్తుల విస్తరణ పెరిగినట్టు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఆరోగ్య బీమా పరంగా వినూత్నమైన, కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రత్యేకమైన పాలసీలు రానున్నాయని మాథుర్‌ అంచనా వేశారు. పారదర్శకత పెంపు దిశగా ఐఆర్‌డీఏ తీసుకున్న చర్యలతో రానున్న సంవత్సరాల్లోనూ పరిశ్రమ వృద్ధి కొనసాగిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఈడీ సురేష్‌ బాదామి తెలిపారు. 

మరిన్ని వార్తలు