ఐదేళ్ల కనిష్టానికి ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటు

27 Apr, 2018 13:25 IST|Sakshi

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ నిర్ణయించిన వడ్డీరేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను, ప్రావిండెంట్‌ ఫండ్‌ సేవింగ్స్‌పై చెల్లించే ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటు ఐదేళ్ల కనిష్టంలో 8.55 శాతంగా ఉంది. గతేడాది కంటే ఈ వడ్డీ రేటు 10 బేసిస్‌ పాయింట్లు తక్కువ. గతేడాది ఈ వడ్డీరేటు 8.65 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో సుమారు 200 మిలియన్ల మంది అధికారిక రంగ వర్కర్లున్నారు. వడ్డీరేట్లపై ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డు ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిందని సీనియర్‌ కార్మిక మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. అనధికారికంగా కొన్ని సూచనలు చేసినట్టు పేర్కొన్నారు. 

కార్మిక​, ఉద్యోగవకాశాల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి సంతోష్‌ గంగ్వార్‌ ఆధ్వర్యంలో ఈపీఎఫ్‌ఓ ట్రస్టీలు ఏప్రిల్‌ 21న సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటు 8.65 శాతంగా నిర్ణయించారు. కాగ, గతేడాది ఈ రేటు 8.65 శాతంగా, 2015-16లో 8.8 శాతంగా, 2013-14, 2014-15లలో 8.75 శాతంగా ఉన్నాయి. గత కొన్నేళ్ల నుంచి పీపీఎఫ్‌లపై చెల్లించే వడ్డీరేట్లను ఈపీఎఫ్‌ఓ తగ్గిస్తూ వెళ్తోంది. అయినప్పటికీ 8.55 శాతం అన్నది మంచి రేటేనని ప్రభుత్వం చెబుతోంది. డిసెంబర్‌లోనే ప్రభుత్వం తన చిన్న పొదుపు పథకాలపై 20 బేసిస్‌ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం చివరిలో సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలో ఏడాది వడ్డీ క్రెడిట్‌ అవుతుంది. ఆన్‌లైన్‌ లేదా యాప్స్‌ ద్వారా సబ్‌స్క్రైబర్లు తమ బ్యాలెన్స్‌ను చెక్‌చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు