ఈపీఎఫ్‌ఓకు మరింత పవర్‌!

24 Oct, 2018 00:25 IST|Sakshi

ఫండ్‌ మేనేజర్‌గా అవతారం...!

సామాజిక భద్రతా నిధులన్నీ దీని చేతికే

ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్ల ద్వారా కార్యకలాపాలు

కేంద్రం సూచనల మేరకే ఎప్పటికప్పుడు పెట్టుబడులు!

కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసే యోచన

అది విజయవంతమైతే అన్ని రాష్ట్రాలకూ విస్తరణ  

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని కేంద్రం భావిస్తోంది. ప్రైవేటు రంగంలోని 6 కోట్ల మంది సభ్యుల భవిష్యనిధి పెట్టుబడులను నిర్వహిస్తున్న ఈపీఎఫ్‌వోకు... మిగిలిన సామాజిక భద్రతా పథకాల నిధుల నిర్వహణను కూడా అప్పగించాలన్నది కేంద్రం ఆలోచన. ఇందుకోసం ఈపీఎఫ్‌వోను ఫండ్‌ మేనేజర్‌గా మార్చాలనుకుంటోంది. తద్వారా దేశంలో 50 కోట్ల మందికి సామాజిక భద్రతను అందించే గురుతర బాధ్యతను దానిపై మోపాలన్నది కేంద్రం యోచనగా తెలియవచ్చింది.

ఇదే జరిగితే... ఈపీఎఫ్‌వో నిర్వహణ (ఎగ్జిక్యూటివ్‌ అధికారం) రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే సామాజిక భద్రతా బోర్డుల పరిధిలోకి వెళుతుంది. ఫండ్‌ మేనేజర్‌ పాత్రలో సామాజిక భద్రతా పెట్టుబడులపై రాబడుల ఆధారంగా ఈపీఎఫ్‌వో ఏటా వడ్డీ రేటును ప్రకటిస్తుంది. ఆరు కోట్ల మంది చందాదారుల నిధుల నిర్వహణలో ఈపీఎఫ్‌వోకు ఉన్న అపారమైన అనుభవాన్ని వినియోగించుకుని ప్రయోజనం పొందడమే ఇందులోని లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రయోగాత్మకంగా తొలుత కొన్ని రాష్ట్రాల్లో నూతన విధానాన్ని అమలు చేసి, ఎదురయ్యే సమస్యలపై అవగాహన వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.  

పెట్టుబడుల వ్యవహారాలు...  
అన్ని రాష్ట్రాల సామాజిక భద్రతా నిధుల నిర్వహణను చూసే సెంట్రల్‌ బోర్డుగా ఈపీఎఫ్‌వో ఇకపై వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. అయితే, దీనికోసం ఈపీఎఫ్‌వో ప్రస్తుత నిర్మాణంలో ఎన్నో  మార్పులు చేయాలని, నిపుణులైన ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్లను నియమించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఫండ్‌ మేనేజర్లుగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ప్రైమరీ డీలర్‌షిప్, రిలయన్స్‌ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ ఈపీఎఫ్‌వో పెట్టుబడి వ్యవహారాలను చూస్తున్నాయి.

ఈపీఎఫ్‌వో మాత్రం సభ్యుల నుంచి చందాల వసూలు, నిధుల పంపిణీని చూస్తోంది. ‘‘అయితే, ఏ ప్రకారం పెట్టుబడి పెట్టాలన్నది కేంద్ర ఆర్థిక శాఖే తెలియజేస్తుంటుంది. ఈపీఎఫ్‌వోకు సంబంధించిన ఫండ్‌ మేనేజర్లు ఆ ప్రకారం ఇన్వెస్ట్‌ చేస్తారు. దాంతో పెట్టుబడులపై అధిక రాబడులకు అవకాశం ఉంటుంది’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. పెట్టుబడులపై రాబడుల రేటును ఈపీఎఫ్‌వో నిర్ణయించినా గానీ, దీన్ని అమలు చేయడం లేదా అధిక రిటర్నులు ఇచ్చే విషయం రాష్ట్రాల బోర్డులకు ఉంటుందన్నారు.

ప్రస్తుతం పెట్టుబడుల విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేస్తోంది. 2015 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లో ఉన్న ప్రస్తుత విధానం కింద... 50 శాతం వరకు పీఎఫ్‌ నిధులను ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. అలాగే 45 శాతం వరకు డెట్‌ సాధనాల్లో, 15 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు అవకాశం ఉంది. వీటిల్లో ప్రభుత్వ సెక్యూరిటీలు, డెట్‌ బాండ్స్‌పై రాబడులు 7 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులపై రాబడుల రేటు 16 శాతంగా ఉంది.

లేబర్‌ కోడ్‌ కింద ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి సామాజిక భద్రతా నిధుల వసూలు కోసం అన్ని రాష్ట్రాల్లోనూ స్వతంత్ర బోర్డులను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ప్రణాళిక. చందాదారుల సంఖ్యను 50 కోట్ల వరకు పెంచాలన్న లక్ష్యం కూడా ఉంది. మెడికల్‌ ఇన్సూరెన్స్, వైకల్య కవరేజీ, మ్యాటర్నిటీ కవరేజీ సహా అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలకు సింగిల్‌ విండోను ఏర్పాటు చేయడం ఈ విధానంలో భాగం.   

మరిన్ని వార్తలు