ఈపీఎఫ్‌వోపై తగ్గనున్న వడ్డీ రేటు!

27 Nov, 2017 00:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేయగా, 2017–18కి సంబంధించి వడ్డీ రేటును ఖరారు చేయాల్సి ఉంది. ‘‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భవిష్యనిధి డిపాజిట్లపై 2017–18 సంవత్సరానికి రాబడుల రేటును తగ్గించొచ్చు. బాండ్లపై తక్కువ రాబడులకుతోడు, ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) యూనిట్లను చందాదారుల ఖాతాల్లో జమ చేయనుండటమే ఇందుకు కారణం’’ అని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు.

 ఈక్విటీల్లో పెట్టుబడుల విలువను గణించే విధానానికి ఈపీఎఫ్‌వో ఇప్పటికే ఆమోదం కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని ఐఐఎం బెంగళూరుతో కలసి రూపొందించడం జరిగింది. దీని ప్రకారం సబ్‌స్క్రయిబర్ల ఖాతాల్లో ఈటీఎఫ్‌ యూనిట్లను జమ చేస్తారు. దీంతో ప్రతీ ఈపీఎఫ్‌ఓ సభ్యుడు తన ఖాతాలో నగదు బ్యాలన్స్‌ ఎంతుంది, ఎన్ని ఈటీఎఫ్‌ యూనిట్లు ఉన్నదీ తెలుసుకోగలరు. ఈటీఎఫ్‌లపై వచ్చే డివిడెండ్‌ను సైతం వారి ఖాతాల్లోనే జమ చేస్తారు. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులపై వాస్తవ రాబడి రేటు ఉపసంహరణ సమయంలోనే తెలుస్తుంది.   

మరిన్ని వార్తలు