పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త

17 Sep, 2019 16:12 IST|Sakshi

8.65 శాతం పీఎఫ్ వడ్డీ రేటు పెంపు అమలులోకి

పండుగ సీజన్ కన్నా ముందుగానే కొత్త వడ్డీ రేటు వర్తింపు

6 కోట్ల మంది  పీఎఫ్‌  చందాదారులకు  తీపి కబురు  

సాక్షి, న్యూఢిల్లీ:  ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు శుభవార్త అందించింది. 2018-19 సంవత్సరానికి 6 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లోకి త్వరలోనే వడ్డీని చెల్లించనున్నారు.  మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే కొత్త వడ్డీ రేటు అమలులోకి వస్తుందని, తద్వారా  ఆరు కోట్ల మంది  ఖాతాదారులకు ప్రయోజనం  చేకూరనుందని  తెలిపారు.  2018-19 సంవత్సరానికి గాను 8.65శాతం వడ్డీని చెల్లించనున్నామన్నారు.  పండుగ సీజన్ కన్నా ముందుగానే పీఎఫ్  ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇది 8.55 శాతం మాత్రమే. 

2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు వారి  పీఎఫ్  ఖాతాల్లో త్వరలోనే 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని  మంత్రి స్పష్టం చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరపు వడ్డీ రేటుతో (8.55 శాతం) పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ 10 బేసిస్ పాయింట్లు (8.65 శాతం) ఎక్కువగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి గత మూడేళ్లలో  ఈపీఎఫ్‌ వడ్డీ రేటు పెరగడం ఇదే తొలిసారి.  2015–16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీరేట్లు 8.8 శాతం ఉండగా అప్పటి పరిస్థితుల రీత్యా వాటిని క్రమంగా ఐదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి తగ్గించారు. 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించిన తరువాత 151.67 కోట్ల మిగులు ఉంటుందని ఈపీఎఫ్‌వో అంచనా.  మునుపటి ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.7 శాతం  వడ్డీ రేటును అందించడంపై 158 కోట్ల లోటు ఉండేది. అందుకే 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించాలని నిర్ణయించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా