పీఎఫ్‌పై మరో 5 బ్యాంకులతో ఈపీఎఫ్‌వో జట్టు

6 Jul, 2017 01:46 IST|Sakshi
పీఎఫ్‌పై మరో 5 బ్యాంకులతో ఈపీఎఫ్‌వో జట్టు

న్యూఢిల్లీ: ప్రావిడెంట్‌ ఫండ్‌ బకాయిల స్వీకరణ, పీఎఫ్‌ విత్‌డ్రాయల్స్‌ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో మరో అయిదు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వీటిలో ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న సంస్థలు అగ్రిగేటర్‌ విధానంలో కాకుండా పీఎఫ్‌ బకాయిలను ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను ఉపయోగించి నేరుగా ఈపీఎఫ్‌వో ఖాతాలోకే జమచేయొచ్చు.

వసూళ్లు, చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడగలవని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. ఈపీఎఫ్‌వోకు వ్యయం దీనివల్ల ఏటా రూ. 125 కోట్లకు తగ్గనుంది. ఈ ఒప్పందాలు లేకపోతే.. ఈపీఎఫ్‌వో అగ్రిగేటర్‌ విధానంలో స్వయంగా బకాయిలను వసూలు చేసుకుని, చెల్లింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతీ లావాదేవీ వ్యయం సుమారు రూ. 12 మేర ఉంటోంది.

వివిధ బ్యాంకుల్లో ఖాతాలున్న సభ్యులకు చెల్లింపులు జరిపేందుకు ఏటా తమకు రూ. 350 కోట్ల మేర లావాదేవీ వ్యయాలు అవుతున్నాయని.. ఎస్‌బీఐతో పాటు పీఎన్‌బీ తదితర బ్యాంకులతో టైఅప్‌ కారణంగా ఇది ఇప్పటికే రూ. 175 కోట్లకు తగ్గిందని సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వీపీ జాయ్‌ తెలిపారు. తాజాగా మరో అయిదు బ్యాంకులతో ఒప్పందాల వల్ల లావాదేవీ వ్యయాలు మరో రూ. 50 కోట్ల దాకా తగ్గుతాయన్నారు. ఇంకో ఏడు బ్యాంకులతో కూడా చర్చలు జరుపుతున్నామని, అవి కూడా ఫలవంతమైతే వ్యయాలు ఏటా కేవలం కొన్ని కోట్లకు మాత్రమే పరిమితం కాగలవని జాయ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు