స్టాక్స్‌లో నష్టపోకూడదంటే..?

23 Mar, 2020 05:19 IST|Sakshi

కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి

అనుకూల సమయం ఎప్పుడన్నది చెప్పలేం

అప్పటి వరకూ వేచి చూస్తేనే లాభాలు

స్థాయిని మించి రిస్క్‌ తీసుకుంటే ప్రమాదమే

వైవిధ్యం లేకపోతే నష్టాలకు చాన్స్‌

తగినంత అధ్యయనం లేకుండా ఇన్వెస్ట్‌ చేయరాదు

సంపద కూడబెట్టుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఈక్విటీలది అగ్ర తాంబూలం. మార్కెట్‌ పతనాలే మంచి పెట్టుబడి అవకాశాలను తెచ్చిపెడతాయి. గతంలో భారీ పతనాలు ఎన్నో వచ్చి వెళ్లాయి. ఈక్విటీ మార్కెట్లు పడి లేచిన బంతి మాదిరిగా ఆ పతనాల నుంచి నూతన శిఖరాలకు చేరడాన్ని చూశాం. ప్రపంచ ఆర్థిక మాంద్యం 2008లో మన ఈక్విటీ మార్కెట్లను 50 శాతానికి పైగా పడవేయగా, ఆ తర్వాత కాలంలో మార్కెట్లు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ మార్కెట్‌ను ముంచేస్తోంది. షేర్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఇప్పటికే సూచీలు 30 శాతానికి పైగా నష్టపోయాయి. ‘అందరూ ఎగబడి కొంటుంటే ఆ సమయంలో జాగ్రత్త పడాలి.. అందరు భయంతో అమ్మకాలు సాగిస్తుంటే అప్పుడు ఆశతో కొనుగోలు చేయాలన్నది’ వారెన్‌ బఫెట్‌ నమ్మే సూత్రం. ఇప్పుడు దీన్ని అనుసరించే సమయం ఆసన్నమైంది.  
   
అయితే, ఈక్విటీల్లో రాబడులు తెచ్చుకోవాలంటే కరెక్షన్‌లో షేర్లను తక్కువ ధరల వద్ద కొనుగోలు చేయడం ఒక్కటే కాదు.. ఆ షేర్లు నాణ్యమైన కంపెనీలవి అయి ఉండాలి. భవిష్యత్తు ఉన్నవి కావాలి. అంటే చేసే పెట్టుబడుల్లో తప్పటడుగులకు చోటు లేకుండా చూసుకోవాలి. ఈక్విటీ రాబడులకు తగిన విషయ పరిజ్ఞానం, అధ్యయనం అవసరం. కేవలం కొన్ని తప్పులు పెట్టుబడి మొత్తాన్ని హరించేస్తాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారిలో చాలా మంది కనీసం ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా సాగిపోతుంటారు. తమ రిస్క్‌ స్థాయిలను తెలుసుకోకుండా రాబడుల కాంక్షతో దూకుడుగా వెళ్లి చేతులు కాల్చుకుంటుంటారు. కానీ, ఏదైనా కోల్పోవడం అంత సులభం కాదు రాబట్టుకోవడం. ఇదే సూత్రం ఈక్విటీలకూ వర్తిస్తుంది. ఈక్విటీల పట్ల సరైన అవగాహన లేకుండా, భారీ నష్టాలను మూటగట్టుకుంటే.. ఆ తర్వాత పెట్టుబడులపై ఈ ప్రభావం కచ్చితంగా పడుతుంది. అందుకే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ను కాపాడుకుంటూ, దీర్ఘకాలంలో రాబడులు పోగేసుకోవాలంటే కొన్ని తప్పులకూ దూరంగా ఉండాలి. ఆ వివరాలను డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఏవీపీ అమిత్‌ గ్రోవర్‌ వెల్లడించారు.

సమయం ఎంచకూడదు
ఈక్విటీ పెట్టుబడులకు సమయం నిర్దేశించుకోవడం సరైనది కాదు.  ఇటాలియన్‌ ఆర్థికవేత్త పారెటో పరిశోధన 80–20 సూత్రాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు కంపెనీల ఉత్పత్తుల్లో 20 శాతం ఉత్పత్తుల నుంచి 80 శాతం ఆదాయం వస్తుంటుంది. అలాగే, ఓ కంపెనీ లాభాలకు 20 శాతం ఉద్యోగుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. అలాగే, 20 శాతం ప్రయత్నాలు మన విజయాల్లో 80 శాతం పాత్ర పోషిస్తాయి.

పారెటో రూపొందించిన సూత్రం ఈక్విటీలకు కూడా అమలవుతుంది. ఎందుకంటే స్టాక్‌ మార్కెట్‌ రాబడుల్లో 80 శాతం కేవలం 20 శాతం సమయంలోనే వస్తుంటాయి. కానీ, ఈ 20 శాతం సమయం ఎప్పుడన్నది ఊహించడం అసాధ్యం. ఎంతో ఓపికగా, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసా గించేలా ఉండాలి. అప్పుడే ఆ 20 శాతం సమయంలోకి అడుగుపెట్టి మంచి రాబడులు పొందే అవకాశం లభిస్తుంది. కొంత కాలం పాటు పెట్టుబడులను కొనసాగించి, రాబడుల సమయం వచ్చే వరకు వేచి చూడలేక నిరాశతో వెనక్కి తీసేసుకుంటే.. ఆ విలువైన రాబడుల అవకాశాన్ని కోల్పోయినట్టే.

వైవిధ్యం లేకపోవడం
క్రికెట్‌లో ప్రతీ బాల్‌కు ఆరు పరుగులు (సిక్సర్‌) నమోదు చేయడం సాధ్యం కాదన్న విషయం బ్యాట్స్‌మెన్‌కు తప్పకుండా తెలిసి ఉంటుంది. ఆరు పరుగులు, నాలుగు, రెండు పరుగులు, ఒక పరుగు ఇలా అన్నీ సమకూర్చుకుంటేనే సెంచరీ మార్కు సాధ్యపడుతుంది. పెట్టుబడి కూడా అంతే. గత 40 ఏళ్ల స్టాక్‌ మార్కెట్‌ చరిత్రను తిరగేస్తే 100 రెట్లు పెరిగిన కంపెనీలు ఎన్నో కనిపిస్తాయి. తమ తమ రంగాల్లో దిగ్గజాలుగా అవతరించినవీ ఉన్నాయి. మరోవైపు దివాలా తీసిన కంపెనీలూ కనిపిస్తాయి. కానీ, ఇన్వెస్టర్లకు ఇలా ఎన్నో రెట్లు లాభాలను ఇచ్చిన మల్టీబ్యాగర్‌ కథనాలే ఆసక్తి కలిగిస్తాయి. వైఫల్య కథనాలను పట్టించుకోకుండా.. మల్టీబ్యాగర్‌ ఆకాంక్షతో కేవలం కొన్ని స్టాక్స్‌లోనే తమ పెట్టుబడులు అన్నింటినీ కుమ్మరించేస్తుంటారు. కానీ, ఇది ఎంతో రిస్క్‌తో కూడిన వ్యాపారం. తమ పెట్టుబడులు, కాల వ్యవధికి అనుగుణంగా తగినంత వైవిధ్యంతో కూడిన స్టాక్‌ పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులు పొందడంతోపాటు ఒక్కో స్టాక్‌ వారీ రిస్క్‌ కూడా తక్కువ అవుతుంది.

తగినంత అధ్యయనం లేకుండా..
ఓ విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటే ఎన్నో నెలల పాటు అధ్యయనం చేస్తుంటారు. ఏ ఏ ప్రాంతాలను చుట్టి రావాలి, అక్కడ ఉండే వసతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఖర్చులు ఇలా అన్నింటిపైనా అవగాహన కోసం ఎంతో మందిని విచారిస్తాం. ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలన్నా ఇదే స్థాయిలో సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ, భవిష్యత్తు కోసం ఉద్దేశించి పెట్టుబడులు పెట్టే ముందు తగినంత అధ్యయనం లేకపోతే ఎలా..? కంపెనీ వాటాలను కొనుగోలు చేస్తున్నారంటే.. ఆయా కంపెనీల వ్యాపారం, యాజమాన్యం, ఆర్థిక పరిస్థితులు, ఆ కంపెనీ పనిచేసే రంగం, దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఎన్నో అంశాలను అర్థం చేసుకోవాలి. అదృష్టం కలిసివస్తే స్టాక్స్‌ ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లకు తమ సామర్థ్యంపై నమ్మకం మరింత బలపడుతుంది. నిజానికి బుల్‌ మార్కెట్‌లో అన్ని స్టాక్స్‌ ర్యాలీ చేస్తుంటాయి. దాంతో తమ నైపుణ్యాలు, అదృష్టం మధ్య వ్యత్యాసం వారికి అర్థం కాదు. కానీ, ఆటుపోట్లు బయటపడినప్పుడే అసలు విషయం బయటపడుతుందని విఖ్యాత స్టాక్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ చెప్పే మాట ఇక్కడ గమనార్హం.

భరించలేనంత రిస్క్‌
ఈక్విటీ మార్కెట్లు ఎక్కువగా ఆటుపోట్లతో కూడి ఉంటాయి. స్వల్పకాలంలోనే స్టాక్స్‌లో లేదా సూచీల్లో 10–20% నష్టాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం వచ్చిన 2008, హర్షద్‌ మెహతా స్కామ్‌ వెలుగుచూసిన 1990ల్లో అయితే స్టాక్‌ మార్కెట్లు 50 శాతానికి పైగా నష్టపోయాయి. సాధారణ మార్కెట్‌ పరిస్థితులను అనుసరించి ఎక్కువ మంది పోర్ట్‌ఫోలియో నిర్మాణం చేసుకుంటుంటారు. కానీ, మార్కెట్‌ పతనాల్లో పెట్టుబడి హరించుకుపోకుండా ఉండాలంటే రిస్క్‌ నిర్వహణ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే విధంగా జవానులు ఎలా తర్ఫీదు అయితే పొందుతారో.. ఇన్వెస్టర్లు సైతం అత్యంత ప్రతికూల పరిస్థితులనూ నెగ్గుకొచ్చే విధంగా పోర్ట్‌ఫోలియో నిర్మాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.   

రాబడుల కోసం పరుగు
రాబడుల కోసం పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులకు సంబంధించి నిర్దేశిత ప్రక్రియను పాటించడం ఎంతో అవసరం. ఎలుకకు ఏదో ఒక ఆహారాన్ని వేసి బంధించినట్టుగానే.. మనల్ని బుట్టలో వేయాలంటే అందుకు ఆకర్షణీయమైన హామీలు గుప్పిస్తే సరి. స్కామర్లు భారీ రాబడులను ఎరగా చూపుతుంటారు. వీటికి ఆకర్షితులైన వారు ఎలుకల మాదిరే వాటిల్లో చిక్కుకుంటారు. రాబడులు అన్నవి కంటికి కనిపించేవి. కానీ, రిస్క్‌ కనిపించని రూపంలో ఉంటుంది. గత నాలుగు ఐపీవోలు లిస్టింగ్‌లో 10 శాతం పైనే రాబడులు ఇచ్చాయనుకుంటే.. ఐదో ఐపీవో కూడా లిస్టింగ్‌లో ఇదే విధమైన రాబడులు ఇస్తుందని భావించడం సురక్షితమేనా..? ఇన్వెస్టింగ్‌ విధానాన్ని అర్థం చేసుకోవడం వల్ల స్టాక్‌ పెరుగుదల, పతనాల్లో నిశ్చింతగా ఉండే బలాన్నిస్తుంది. తద్వారా దీర్ఘకాలం పాటు సౌకర్యంగా వాటిల్లో కొనసాగగలరు.  

స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్‌మెంట్‌
40 ఏళ్లలో సెన్సెక్స్‌ (1979–2019) ప్రయాణాన్నే పరిశీలిస్తే.. మీరు ఏడాది కాలం కోసం ఇన్వెస్ట్‌ చేస్తే 33 శాతం కేసుల్లో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదే ఐదేళ్ల కాల వ్యవధి కోసం ఇన్వెస్ట్‌ చేస్తే నష్టపోయే అవకాశాలు 8 శాతమే. అదే 10 ఏళ్ల కాలం కోసం ఇన్వెస్ట్‌ చేస్తే నష్టపోయే అవకాశాలు 3 శాతమే. 15 ఏళ్ల కాల వ్యవధి కోసం ఇన్వెస్ట్‌ చేస్తే నష్టపోయే ప్రమాదం సున్నా. 40 ఏళ్ల కాలంలో సెన్సెక్స్‌ పనితీరు ఆధారంగా అంచనాలు ఇవి. అమెజాన్‌ చైర్మన్, సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఒకసారి వారెన్‌ బఫెట్‌ను.. ‘మీ పెట్టుబడుల సిద్ధాంతం చాలా సులభంగా ఉంటుంది. కానీ, ప్రతి ఒక్కరూ దీన్ని ఎందుకు అనుసరించరు?’ అని ప్రశ్నించారు. ‘‘ఎందుకంటే ఎవరూ కూడా నిదానంగా ధనవంతులు కావాలని కోరుకోరు’’ అంటూ బఫెట్‌ బదులిచ్చారు. అంటే చాలా వేగంగా రాబడులు పోగేసుకోవాలనే ఆకాంక్షే తప్పటడుగులకు దారితీస్తుందని గ్రహించాలి.

విలువకు విలువ ఇవ్వకపోవడం..
ధర అన్నది చెల్లించేది.. కానీ, విలువ అన్నది మీరు పొందేది. మార్కెట్లు అన్నవి ఉత్సాహం, నిరాశావాదం మధ్య చలిస్తుంటాయి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కంటే.. వదంతులు, ఊహాజనితాల ఆధారంగానే ఎక్కువగా చలించడం ఉంటుంది. దీంతో తాము కొనుగోలు చేస్తున్న వాటి విలువను పరిశీలించకుండా, ఈ విధమైన కథనాలపై ఆధారపడి అడుగులు వేయవద్దు. భవిష్యత్తు రాబడులు అన్నవి మీ కొనుగోలు ధరపైనే ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి. కనుక మీరు ఓ స్టాక్‌లోకి ప్రవేశించే ధర చాలా అధిక స్థాయిలో ఉంటే భవిష్యత్తు రాబడులు తక్కువగా ఉండడం లేదా ప్రతికూలంగా ఉండడం జరగొచ్చు. కనుక అసలు విలువను గుర్తించడం నేర్చుకోవాలి.

తగిన అవగాహన లేకుండా...
ఇన్వెస్టింగ్‌ అనేది ప్రత్యేకమైన ఉద్యోగమే. ఫైనాన్స్, అకౌంటింగ్, వ్యాల్యూషన్లు వీటన్నింటిని అర్థం చేసుకోగలిగి ఉండాలి. యాజమాన్యం గురించి తెలుసుకోవాలి. ఆ కంపెనీ పనిచేస్తున్న విభాగం/రంగం గురించి తగినంత అవగాహన ఉండాలి.

మార్కెట్‌ ఆటుపోట్లను అధిగమించే ప్రశాంతత అవసరం. ఎంతో అనుభవం, సమయం, శక్తి పెట్టుబడులకు అవసరం. అందుకే దీన్ని పార్ట్‌ టైమ్‌ కాకుండా పూర్తికాలపు ఉద్యోగంగా పేర్కొంటారు. కనుక అంత సమయం వెచ్చించలేని వారికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మెరుగైన ఆప్షన్‌. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను నిపుణులు నిర్వహిస్తుంటారు. పైగా పెట్టుబడుల్లో తగినంత వైవిధ్యం కూడా ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుకే తగినంత వైవిధ్యాన్ని ఫండ్స్‌ ద్వారా పొందొచ్చు.

మరిన్ని వార్తలు