అస్థిరతల్లోనూ చెదరని విశ్వాసం

12 Mar, 2020 11:36 IST|Sakshi

ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.10,730 కోట్ల ప్రవాహం

11 నెలల గరిష్ట స్థాయికి

ఫిబ్రవరి నెల గణాంకాలు విడుదల

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల వల్ల కుదేలవుతుంటే.. పెట్టుబడులకు ఇది చక్కని సమయమని భావించే ధోరణి ఇన్వెస్టర్లలో పెరుగుతోంది. ఇన్వెస్టర్ల పరిణతిని ప్రతిఫలించే విధంగా ఫిబ్రవరి మాసంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికరంగా రూ.10,730 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే విధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాల్లో) మొత్తం మీద రూ.1,985 కోట్ల పెట్టుబడులు ఫిబ్రవరిలో బయటకు వెళ్లిపోయాయి. జనవరిలో  మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక జనవరిలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.7,547 కోట్లు. దీంతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో పెట్టుబడులు రాక నికరంగా 42 శాతం పెరిగి రూ.10,730 కోట్లుగా ఉంది. 2019 మార్చిలో రూ.11,756 కోట్ల పెట్టుబడుల తర్వాత ఒక నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన అత్యధిక పెట్టుబడులు మళ్లీ ఫిబ్రవరిలోనే కావడం గమనార్హం. కరోనా వైరస్‌ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తుండడంతో మన ఈక్విటీ మార్కెట్లు నెల వ్యవధిలోనే 15 శాతం వరకు నష్టపోయిన విషయం తెలిసిందే.

ముఖ్య గణాంకాలు..
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌/క్రమానుగత పెట్టుబడుల విధానం) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.8,513 కోట్లు.   
మల్టీక్యాప్‌ పథకాల్లోకి రూ.1,625 కోట్లు, లార్జ్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.1,607 కోట్లు, మిడ్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.1,451 కోట్లు, స్మాల్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.1,498 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మరించారు.  
ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.871 కోట్లుగా ఉన్నాయి.
గోల్డ్‌ ఈటీఎఫ్‌లు నికరంగా రూ.1,483 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతక్రితం నెలలో వచ్చిన రూ.202 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఈక్విటీల్లో అనిశ్చితితో బంగారం ర్యాలీ చేస్తుండడం తెలిసిందే. దీంతో వరుసగా నాలుగో నెలలోనూ పెరుగుదల నమోదైంది.
ఫిబ్రవరి నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ (పెట్టుబడులు) జనవరిలో ఉన్న రూ.27.86 లక్షల కోట్ల నుంచి రూ.27.23 లక్షల కోట్లకు పరిమితం అయింది.

మరిన్ని వార్తలు