హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం

20 Apr, 2020 12:14 IST|Sakshi

సాక్షి, ముంబై :  కోవిడ్ -19 మహమ్మారి  విస్తరణతో ప్రపంచ మార్కెట్లలో మొత్తం సినిమా నిర్మాణ రంగం సంక్షోభంలో వుండగా హాలీవుడ్‌కు చెందిన ఎస్‌టీఎక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీనం అవుతున్నట్టు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. ఈ కంపెనీలో సమాన వాటాను విలీనం చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. విలీన వార్తలలో ఇవాళ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌కు భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. దీంతో ఈ స్టాక్‌ ఏప్రిల్ 20 న ఉదయం ట్రేడింగ్ లో 10శాతం అప్పర్‌ సర్క్యూట్‌(రూ.16.35) వద్ద ఫ్రీజ్ అయింది.

ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఎస్‌టిఎక్స్ సంస్థ 'హస్ట్లర్స్', బ్యాడ్మామ్స్ లాంటి 34 సినిమాలను నిర్మించింది.  మొత్తం 1.5 బిలియన్‌ డాలర్లను వసూలు చేసి బ్లాక్ బ్లస్టర్ సినిమాలుగా నిలవడం విశేషం. 11 సంవత్సరాల క్రితం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కరోనా వైరస్  కాలంలో కొత్త అవతారాన్ని దాల్చింది. బద్లాపూర్, బజరంగీ భైజాన్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలను నిర్మించిన ఏరోస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో హాలీవుడ్ కంపెనీతో కలిసి ఈరోస్ ఎస్టీఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్  పేరుతో గ్లోబల్ సంస్థగా  అవతరించింది. అలాగే రెండు కంపెనీల విలీనం తరువాత కంపెనీ ఫౌండర్ ప్రస్తుత సీఈఓ కిషోర్ లుల్లాఎగ్జిక్యూటివ్ కో-చైర్మన్‌గా, ఎస్‌టిఎక్స్‌ సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ సిమండ్స్ కొత్త కంపెనీకి సీఈఓగా వ్యవహరించనున్నారు. (భారీగా తగ్గిన బంగారం ధర : ఈ అక్షయ తృతీయకు కొనేదెలా?)

కోవిడ్‌-19 తో సినిమా రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ మహమ్మారితో సినిమా నిర్మాణ రంగం మొత్తం మూతపడింది. ఈ సమయంలో ఒక బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌తో కొత్త సంస్థను సృష్టిస్తున్నాం. ఏరోస్‌, ఎస్‌టీఎక్స్‌ విలీన సంస్థలో ప్రస్తుత వాటాదారులు 42శాతం వాటాను కలిగివుంటారు. టీపీజీ, హనీ క్యాపిటల్‌, లిబర్టీ గ్లోబల్‌తో పాటు ఎస్‌టీఎక్స్‌కు చెందిన ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి 125 మిలియన్‌ డాలర్ల తాజా మూలధనాన్ని సేకరిస్తున్నామని ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రదీప్‌ ద్వివేది వెల్లడించారు. బాలీవుడ్‌కు ఇది చాలా మంచి వ్యాపార వార్త అని, ఈ నిధులను ఫిల్మ్ ప్రొడక్షన్ , డిజిటల్ కంటెంట్ కోసం ఉపయోగిస్తామని తెలిపారు.ఇప్పటికే 75 మిలియన్ డాలర్లకు పైగా అందుకున్నామని, జూన్ చివరి నాటికి  ఈ డీల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు