ఈ షేర్ల రికార్డుల ర్యాలీ చూడతరమా!

9 Jul, 2020 13:18 IST|Sakshi

చరిత్రాత్మక గరిష్టాల రికార్డు

జాబితాలో ఆల్కిల్‌ అమైన్స్‌

ఎస్కార్స్ట్‌, టాటా కన్జూమర్‌

డిక్సన్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌

సెన్సెక్స్‌ జోరు-ట్రిపుల్‌ సెంచరీ

మార్కెట్లు జోరుమీదున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. 321 పాయింట్లు జంప్‌చేసి 36,650కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 85 పాయింట్లు ఎగసి 10,791 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న పలు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు సరికొత్త గరిష్టాల రికార్డులను సృష్టిస్తున్నాయి. జాబితాలో తాజాగా స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ ఆల్కిల్‌ అమైన్స్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ కంపెనీ డిక్సన్‌ టెక్నాలజీస్‌, ట్రాక్టర్ల దిగ్గజం ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌, ఐటీ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్‌ చోటు సాధించాయి. కొద్ది రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ఈ కౌంటర్లన్నీ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాలను అందుకోవడం విశేషం! వివరాలు చూద్దాం..

ఆల్కిల్‌ అమైన్స్‌ కెమికల్స్‌
గత మూడు నెలల్లో 69 శాతం ర్యాలీ చేసిన ఆల్కిల్‌ అమైన్స్‌ కెమికల్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2.6 శాతం ఎగసి రూ. 2360 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2375ను తాకింది. మార్చి త్రైమాసికంలో ఆల్కిల్‌ అమైన్స్‌ పన్నుకు ముందు లాభం(ఇబిట్‌) 93 శాతం జంప్‌చేసి రూ. 61 కోట్లను అధిగమించింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం సహకరించింది.

టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌
గత ఆరు రోజుల్లో టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ షేరు 14 శాతం బలపడింది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం ఎగసి రూ. 437ను అధిగమించింది. ప్రస్తుతం రూ. 435 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల విదేశీ రీసెర్చ్‌ సంస్థ క్రెడిట్‌ స్వీస్‌ ఈ కౌంటర్‌కు ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతోపాటు ఏడాది కాలానికి రూ. 490 టార్గెట్‌ ధరను ప్రకటించింది.

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌
గత ఆరు రోజుల్లో దాదాపు 8 శాతం పుంజుకున్న ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ తాజాగా ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం లాభపడి రూ. 2079 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2098కు ఎగసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్‌) నుంచి కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌
ట్రాక్టర్ల తయారీ ఎస్కార్ట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత రూ. 1126 సమీపానికి చేరింది. ఇది 3.5 శాతం అధికంకాగా.. ప్రస్తుతం రూ. 1115 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ ఆటో రంగ కౌంటర్‌ 63 శాతం దూసుకెళ్లడం గమనార్హం! సాధారణ వర్షపాత అంచనాలు, గ్రామీణ ఆదాయాలు పుంజుకోవడం, పంటల విస్తీర్ణం పెరగడం వంటి అంశాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

డిక్సన్‌ టెక్నాలజీస్‌
ముందు రోజు 4 శాతం ఎగసిన డిక్సన్‌ టెక్నాలజీస్‌ తాజాగా మరో 4 శాతం జంప్‌చేసింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత రూ. 6,336ను తాకింది. ప్రస్తుతం రూ. 6212 వద్ద కదులుతోంది. కోవిడ్‌-19లోనూ జూన్‌ నెలలో కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగం 100 శాతం రికవరీ సాధించిన వార్తలు ఈ కౌంటర్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు